ఈపీటీఆర్ఐలో ‘పరిశోధన’ పరిహాసం: అర్హులు లేరట.. పాతవారికే పట్టం!

by Kema Shiva Kumar |

తెలంగాణ ఈపీటీఆర్ఐ (EPTRI)లో నియామకాల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. అర్హులైన అభ్యర్థులు లేరంటూ నిరుద్యోగులను అవమానిస్తూ పాతవారినే అప్‌గ్రేడ్ చేసేందుకు కుట్ర జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈపీటీఆర్ఐలో ‘పరిశోధన’ పరిహాసం: అర్హులు లేరట.. పాతవారికే పట్టం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈపీటీఆర్ఐలో ప్రమోషన్లకు అర్హులైన వారే లేరని, ఉన్న వారినే ప్రమోట్ చేయాలని చూడడం వివాదాస్పదంగా మారింది. సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారులు సుటేబుల్ క్యాండిడేట్స్ లేరనడం విస్మయానికి గురిచేస్తోంది. పీహెచ్‌డీ చేసిన అభ్యర్థలు సంస్థ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. తెలంగాణలోని విద్యాధికులను అవమానించడమేనని విమర్శిస్తున్నారు.

పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ)లో పేరుకే పరిశోధన ఉంది. అక్కడ అంతా పరిహాసమే జరుగుతున్నది. శిక్షణ సైతం నామమాత్రమే. అందుకు ఆ సంస్థ వింత వైఖరే కారణం. రిక్రూట్‌మెంట్ కోసం వేసిన నోటిఫికేషన్, ఇంటర్య్వూ సందర్భంగా అసలు అర్హులైన అభ్యర్థులే లేరని తెలంగాణ విద్యావంతులను అవమానించింది. పైగా ఉన్నవారినే అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై యూనివర్సిటీ విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

సుటేబుల్ క్యాండిడేట్స్ లేరట

ఈపీటీఆర్ఐ సంస్థలో అర్హతలేని వారిని కొనసాగించడానికి పోస్టులను భర్తీ చేయడంలేదు. పైగా 11 డిపార్ట్‌మెంట్లకుగాను మూడు డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు. ఉన్నవారు సైతం అర్హతలేనివారేనని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. అయితే 2024లో ఎన్విరాన్‌మెంట్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ డివిజన్‌లో అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి ఈపీటీఆర్ఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల కోసం ఇద్దరు అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచింది. ఆ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ ‘నాట్ సుటేబుల్ క్యాండిడేట్స్’ అని నిర్ణయించింది. పైగా ఇప్పటికే సంస్థలో ఉన్నవారినే అప్‌గ్రేడ్ చేసుకోవాలని నిర్ణయించింది. అంటే కొత్తవారు వస్తే తమ పోస్టులు పోయే ప్రమాదముందని గుర్తించిన సదరు అధికారులు కొత్తవాళ్లకు అవకాశమివ్వకుండా కుట్ర చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.

ఏడాదికి 200 మందికిపైగా...

ఎన్విరాన్‌మెంట్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, క్లైమెట్ చేంజ్ వంటి అంశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), హైదరాబాద్ సెంట్రల్ యూనవర్సిటీ (హెచ్‌సీయూ)లో సంవత్సరానికి 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితోపాటు ఈ కోర్సుల్లో పీహెచ్‌డీ చేసివారు సైతం ఉన్నారు. ఈ కోర్సులను పూర్తిచేసి వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈపీటీఆర్ఐ సంస్థ మాత్రం సుటేబుల్ క్యాండిడేట్స్ లేరని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. ఈపీటీఆర్ఐలోని అధికారుల వైఖరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు మంత్రి కొండా సురేఖకు సైతం ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపించాలి

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన కమిటీ పోస్టులను భర్తీ చేయకుండా.. సుటేబుల్ క్యాండిడేట్స్ లేరనడం విడ్డూరంగా ఉంది. ఎంతో మంది పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఖాళీగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. పోస్టుల భర్తీలో పారదర్శకత ఉండాలి. కొత్త వాళ్లకు అవకాశమివ్వకుండా పాతవారినే అప్‌గ్రేడ్ చేయడమేంటి. అలాంటప్పుడు నోటిఫికేషన్ ఎందుకు వేయాలి.

- ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అర్హులకు అవకాశమివ్వాలి

ఈపీటీఆర్ఐలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పర్యావరణ సంబంధిత కోర్సులు పూర్తి చేసి ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. పోస్టులు భర్తీ చేయకుండా సూటబుల్ క్యాండిడేట్ లేరనడం సరైందికాదు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించడంతోపాటు పోస్టులను భర్తీ చేయాలి.

- ఎండీ జావెద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు

Next Story