రెరా ‘రియల్’ యాక్షన్.. బిల్డర్ల ఆగడాలకు బ్రేక్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-21 02:23:07  IST  )

ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టుకు RERA షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్స్ ట్రా బ్లాకులు, అదనపు అంతస్తులకు ప్రకటనలు, మార్కెటింగ్ చేయడం చట్టా రీత్యా నేరమని పేర్కొంటూ భారీ జరిమానా విధించింది.

రెరా ‘రియల్’ యాక్షన్.. బిల్డర్ల ఆగడాలకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం, 2016లో పొందుపరిచిన అధికారాలతో పుప్పాలగూడలోని ‘ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్’ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్, విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) ప్రణీత్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ప్రాజెక్టులోని ఏ, సీ, డీ బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని, అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే బీ, ఈ, ఎఫ్, జీ బ్లాకులతోపాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, విక్రయాలకు ఆఫర్ చేయడాన్ని అథారిటీ గమనించింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద రూ.43,71,211 జరిమానాను విధించింది. దీంతోపాటు ప్రాజెక్టులో రిజిస్టర్ చేయబడిన భాగానికి సంబంధించి డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని గుర్తించింది. నిర్మాణ ప్రగతి నివేదిక, ప్రాజెక్ట్ నిధుల వినియోగం, అఫిడవిట్‌తో కూడిన సవరించిన గడువును రెండు వారాల్లోపు సమర్పించాలని ప్రమోటర్‌ను ఆదేశించింది. కొనుగోలుదారులందరూ స్వయంగా ‘కొనుగోలుదారుల సంఘం’ ఏర్పాటు చేసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి అథారిటీ అనుమతించింది.

పసిఫికా కన్‌స్ట్రక్షన్‌కు..

బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రెరా తప్పుబట్టింది. అక్రమ ఆలస్య రుసుములను తొలగించి, సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్‌స్ట్రక్షన్‌ను ఆదేశించింది. పాత కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని తేల్చి చెప్పింది. అటువంటి చార్జీలను మినహాయించి, ఒప్పందాల ప్రకారం బకాయిలను లెక్కించి సవరించిన స్టేట్‌మెంట్లను సమర్పించాలని ప్రమోటర్‌ను ఆదేశించింది. బకాయిలు చెల్లించిన వెంటనే, చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం విక్రయ పత్రాలను రిజిస్టర్ చేయాలని, లేనిపక్షంలో సెక్షన్ 63 కింద శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని అథారిటీ స్పష్టం చేసింది. దీంతోపాటు ఉమ్మడి నిర్ణయం కోసం 30రోజుల లోపు ‘కొనుగోలుదారుల సంఘం’ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రమోటర్‌ను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తులసి కన్‌స్ట్రక్షన్స్, భువంతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు..

30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా రెరా కీలక తీర్పు ఇచ్చింది. సూరారంలోని ‘తులసి లేక్ ఫ్రంట్’ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి.సోల్మన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొసెషన్ అప్పగించాలని తులసి కన్‌స్ట్రక్షన్స్ మరియు భువన తేజ ఇన్ ఫ్రా ప్రాజెక్టును ఆదేశించింది. బాధితుడు 2020లోనే రూ.31 లక్షల పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, బిల్డర్ (తులసి కన్‌స్ట్రక్షన్స్), మార్కెటింగ్ ఏజెన్సీ (భువన తేజ ఇన్‌ఫ్రా) మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. బిల్డర్, ఏజెన్సీ మధ్య వివాదాలు కొనుగోలుదారుని చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసిన అథారిటీ, ఈ ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

రాజా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌కు షోకాజ్ నోటీసు..

సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టుపై కూడా రెరా కఠిన చర్యలు తీసుకుంది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ, 548.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్ నిబంధనలను పాటించలేదని గుర్తించింది. భూ యజమానులు రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం ఇవ్వలేదన్న బిల్డర్ వాదనను తోసిపుచ్చిన అథారిటీ, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ బాధ్యతను ఒప్పందాల ద్వారా తప్పించుకోలేరని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి విక్రయాలు, బుకింగ్‌లు లేదా ప్రచారాలు నిర్వహించకూడదని అథారిటీ నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Next Story