జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి వినతి

by Ramesh Naini |

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.. సర్పంచ్​లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పైన తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ డిమాండ్ చేసింది.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.. సర్పంచ్​లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పైన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు పుసులూరి నరేంద్ర, అధ్యక్షుడు చింపుల సత్య నారాయణ రెడ్డిలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. శనివారం స్పీకర్ ను కలిసిన పంచాయతీ రాజ్ ఛాంబర్ బృందం ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఇటీవల అనిరుధ్ రెడ్డి తన నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​ల పట్ల అత్యంత అనుచితమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని, ఆయన సర్పంచ్​లకు నిధులు ఇవ్వకుండా, వారి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటానని, రాజకీయంగా ఎదగనివ్వనని, చంపేస్తానని హెచ్చరించారని వారు ఆరోపించారు.

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని, గ్రామ పంచాయతీల నిధులు రాజ్యాంగ బద్దమైన, చట్టబద్ధమైనవి అని అన్నారు. ఆ నిధులు ఎవరైనా వ్యక్తిగతంగా ఇచ్చేవి కావని, ఆ నిధులను ఎమ్మె ల్యే తన స్వంత నిధులుగా భావిస్తూ మాట్లాడడం, సర్పంచ్​ల హక్కులు హరించడమే అవుతుందన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిచివేసే విధంగా, తమ మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నాయన్నారు. అనిరుధ్ రెడ్డిపై తగిన విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి మనవి చేస్తున్నట్లుగా వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

Next Story