- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మున్సిపల్’ ఫలితాలు రిపీట్.. అసెంబ్లీలోనూ ‘హంగ్’ తప్పదా?
రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచిలా కనిపిస్తున్నాయి. బీజేపీ బలంగా ఉన్న చోట ఓట్లు చీలిపోయి ‘హంగ్’తో రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ఎక్కువగా ఓట్లు, సీట్లు సాధించిందో.. ఆయా పురపాలక సంఘాల్లో హంగ్ ఏర్పడుతున్నది. దీన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేక.. హంగ్ ఏర్పడే అవకాశాలుంటాయని విశ్లేషిస్తున్నారు.
బీజేపీ ఎఫెక్ట్‌తో అధికార పీఠాలపై సస్పెన్స్
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరిగిన చోట అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సీట్లకు గండి పడింది. ఫలితంగా ఆయా మున్సిపాలిటీల్లో అస్పష్టత నెలకొంది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, భైంసా, మెట్ పల్లి, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణ్ పేట్ లాంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. కమలానికి పూర్తి మెజార్టీ రాకపోయినా.. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ కు కూడా స్పష్టమైన ఆధిక్యం లేకుండాపోయింది. బీజేపీ తన ఓటు బ్యాంకు పెంచుకున్న ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రాంతాల్లో నెలకొన్న అస్పష్టత వల్ల బేరసారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
ద్విముఖ పోటీ ఉన్న జిల్లాల్లో స్పష్టమైన తీర్పు
అధికార పార్టీ బలంగా ఉండి బీజేపీ నామమాత్రంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ద్విముఖ పోటీ కనిపించింది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అలాగే ఉమ్మడి మెదక్ లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. ద్విముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు కనిపించింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపించడంతో హంగ్ కు దారితీసినట్లు కనిపిస్తున్నది.
బలమైన నాయకత్వం ఉంటేనే ఓటర్ల మొగ్గు
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఓటర్లు ఏదో ఒక వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ మూడో పార్టీగా బీజేపీ ఉండి, స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అంటే పార్టీనే కాకుండా బలమైన నాయకత్వాన్ని కూడా ఓటర్లు చూస్తున్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది. పార్టీని మాత్రమే చూసి ప్రజలు ఓటు వేస్తే.. రాష్ట్రమంతా బీజేపీనే గెలవాలని.. కానీ అలా జరగలేదని, స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోటనే ప్రజలు ఆ పార్టీని ఆదరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహాలో బీజేపీ స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపితే ఆయా చోట్ల సీట్లు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ సీట్లకు గండి పడి మున్సిపాలిటీ ఫలితాల్లాగే అసెంబ్లీలోనూ అస్పష్టమైన తీర్పు వచ్చి హంగ్ ఏర్పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం చెబుతున్నా.. స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటేనే ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.






