డీసెట్-2025 కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లు..

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన డీసెట్2025 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లు, రిపోర్టు చేయని అడ్మిషన్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనపు సీట్ల భర్తీకి సంబంధించిన తదుపరి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను డీసెట్2025 ఛైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ప్రకటించారు.

డీసెట్-2025 కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన డీసెట్2025 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లు, రిపోర్టు చేయని అడ్మిషన్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనపు సీట్ల భర్తీకి సంబంధించిన తదుపరి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను డీసెట్2025 ఛైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఆర్థికంగా బలహీన వర్గాల కోటాకు అర్హులైన అభ్యర్థులు తమ ఈడబ్లూఎస్ స్టేటస్‌ను https://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఫ్రెష్ అభ్యర్థులు, ఈడబ్లూఎస్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 3 నుండి 5 వరకు ఉమ్మడి పది జిల్లాల ప్రభుత్వ డైట్‌ కాలేజీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

స్లయిడింగ్ కోరుకునే అభ్యర్థులు ఆగస్టు 6 నుండి 7 వరకు వెబ్ ఆప్షన్లను సమర్పించుకోవాలని సూచించారు. ఇప్పటికే చేరిన విద్యార్థులు కూడా స్లయిడింగ్ కోసం తమ వెబ్ ఆప్షన్లను సంబంధిత వెబ్ సైట్ సమర్పించాలని సూచించారు. డీఈడీ, డీపీఎస్ఈ కోర్సులకు సీట్ల కేటాయింపు మెరిట్ ఆర్డర్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఆగస్టు 11న జరుగుతుందని తెలిపారు. ఫ్రెష్, స్లయిడింగ్, ఈడబ్లూఎస్ అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నిర్దేశించిన ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో ఆగస్టు 11, 12 తేదీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. స్లయిడింగ్ ద్వారా ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి మారిన మారిన అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త కాలేజీలో చేరాలి. అలా చేయని పక్షంలో వారు స్లయిడింగ్ కాలేజ్, పాత కాలేజ్ రెండింటిలోనూ సీటును కోల్పోతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్‌లు, 66 ప్రైవేట్ కాలేజీలున్నాయి. కన్వీనర్ కోటా కింద 4130 సీట్లలో, ఫేజ్1, 2 లలో 3134 మంది విద్యార్థులు చేరారు. ఈ రెండు ఫేజ్ లు పూర్తయిన తర్వాత మిగిలిన, రిపోర్టు చేయని సీట్లతో కలిపి 996 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 404 సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం డీఈఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Next Story