పాతబస్తీలో ప్రైవేట్ స్కూల్‌లో మతపరమైన బోధనలు.. ఖురాన్ చదవాలంటూ హోం వర్క్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-16 05:01:56  IST  )

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మతపరమైన బోధనలు చేయడం వివాదాస్పదంగా మారింది. సైదాబాద్‌లోని సక్సెస్ అనే ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాతబస్తీలో ప్రైవేట్ స్కూల్‌లో మతపరమైన బోధనలు..  ఖురాన్ చదవాలంటూ హోం వర్క్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మతపరమైన బోధనలు చేయడం వివాదాస్పదంగా మారింది. సైదాబాద్‌లోని సక్సెస్ అనే ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ డైరీలో కల్మా చదవాలని హోం వర్క్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా.. మా స్కూల్‌లో ఇది తప్పనిసరి అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నేతలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలోనే స్కూల్‌ను ముట్టడిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. దీంతో పోలీసులు అక్కడకు భారీగా చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే దారులన్నింటిని మూసివేశారు. ఘటనపై మీడియాతో స్పందించిన స్కూల్ యాజమాన్యం కల్మా చదవాలని హోం వర్క్ ఇచ్చిన టీచర్‌ను ఉద్యోగం నుండి తీసేసినట్టు చెబుతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదని ఇదే మొదటిసారి అని చెబుతోంది.

స్పందించిన రాజాసింగ్

ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సైదాబాద్‌లోని ప్రైవేట్ స్కూలో రెండవ తరగతి విద్యార్థి డైరీలో కల్మా చదవాలని రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తల్లిదండ్రులు వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారన్నారు. దురదృష్ట‌వ‌శాత్తూ తెలంగాణ‌లోని కొన్ని పాఠ‌శాలల్లో హిందువుల‌ను టార్గెట్ చేస్తూ చిన్నపిల్ల‌ల‌ను ఇస్లాం వైపు మ‌ళ్లించాల‌ని చూస్తున్నార‌న్నారు. ఇలాంటి స్కూళ్లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఇలాంటి స్కూళ్ల‌ను, టీచ‌ర్ల‌ను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేశారు. వాళ్ల‌ను జైలుకు పంపిస్తే మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉంటాయని అన్నారు. ఘ‌ట‌నపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి, త‌ప్పు జ‌రిగితే క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Next Story