తెలంగాణ రైతులకు ఊరట.. రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధం!

by Kema Shiva Kumar |

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. యాసంగి నిధులను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

తెలంగాణ రైతులకు ఊరట.. రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతినెలా 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు జరిగేవి. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయొద్దని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించడంతో నిలిచిపోయాయి. దీనితో ఆ నిధులను రైతు భరోసాకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

హామీ నిలబెట్టుకోవడంపై సీఎం ఫోకస్..

మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఎన్నికలు ప్రక్రియ ముగిసి సుమారు నెల రోజులు పూర్తవుతున్నాయి. దీనితో సాధ్యమైనంత త్వరలో భరోసా నిధులను రైతుల అకౌంట్ లో జమ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఆ మేరకు ఆర్థిక శాఖ అధికారులను నిధుల సమీకరణపై దృష్టిపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఈనెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రైతులందరికీ ఒకేసారి నిధులు ఇవ్వడం కుదరదు. అందుకోసం మొదట ఎకరా పొలం కలిగి రైతులు, ఆ తర్వాత రెండెకరాలు, ఆ తర్వాత మూడెకరాలు.. ఎకరాల వారీగా నిధులను జమ చేయాలని ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందే సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధుల విడుదల తేదీని ప్రకటించనున్నట్టు సమాచారం.

విపక్ష విమర్శలకు చెక్ పెట్టేలా ప్లాన్..

రైతులను మభ్యపెట్టేందుకే యాసంగి భరోసా నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈనెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యాసంగి రైతుభరోసా స్కీమ్ పై సర్కారుపై విమర్శల దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే యాసంగిరైతు భరోసా స్కీం నిధులు విడుదల డేట్స్ ప్రకటిస్తే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Next Story