- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్ట్ పక్కన ఇల్లు కట్టుకోవాలా? ప్రభుత్వం ఇచ్చిన కొత్త రూల్స్ ఇవే!
విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ జీఓ నంబర్ 124 జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగానికి, సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి విమానాశ్రయాల పరిసరాల్లో భవన నిర్మాణాలపై ఉన్న ఆంక్షలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012లో మార్పులు చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 168కు సవరణలు చేసింది. విమానాల రాకపోకలతో కలిగే శబ్ధ కాలుష్యం దృష్ట్యా, గతంలో నిర్మాణాలపై కఠిన నియంత్రణలు ఉండేవి. అయితే, మారుతున్న పట్టణాభివృద్ధి అవసరాలు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త నిబంధనలు ఇలా..
నాయిస్ జోన్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం ప్రస్తుతం మరింత స్పష్టతనిచ్చింది. నాయిస్ జోన్ కిందకు వచ్చే ప్రాంతాల్లో భవనాల ఎత్తుతోపాటు ఆయా రకాల భవనాలకు సంబంధించి గతంలో ఉన్న కొన్ని అడ్డంకులను తొలగించారు. విమానాల శబ్ధం వల్ల నివాసితులకు ఇబ్బంది కలగకుండా, భవన నిర్మాణంలో ధ్వని నిరోధక (సౌండ్ ప్రూఫింగ్) ప్రమాణాలను పాటించడాన్ని తప్పనిసరి చేసింది. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాయిస్ జోన్-1, నాయిస్ జోన్-2 వంటి విభజనల ఆధారంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి భవనాలు (రెసిడెన్షియల్/కమర్షియల్) నిర్మించే భవనాల కోసం స్పష్టమైన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
ప్రయోజనాలు ఇలా..
ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కారణంగా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు, నిర్మాణ రంగంలో పారదర్శకత పెరుగుతుంది. నిబంధనల్లో స్పష్టత రావడంతో భవన నిర్మాణ అనుమతులను తొందరగా జారీ చేయడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గతంలో నాయిస్ జోన్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజా సవరణలతో ఆ సమస్యలు తొలగిపోనున్నాయి. శంషాబాద్, పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఈ జీఓ మార్గం సుగమం కానుంది. విమానాశ్రయ పరిసరాల నియంత్రణ, పౌర భద్రతను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తరుణంలో, ఇలాంటి సవరణలు నగరం అన్ని వైపులా విస్తరించడానికి దోహదపడనున్నాయి. భవన యజమానులు, డెవలపర్లు ఈ కొత్త జీఓ ప్రకారం తమ నిర్మాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.






