గృహ కొనుగోలుదారులకు ఊరట.. టీజీరెరాలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్

by Ramesh Naini |

తెలంగాణ రెరా కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ (పీజీజీసీ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

గృహ కొనుగోలుదారులకు ఊరట.. టీజీరెరాలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రెరా కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ (పీజీజీసీ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్, జస్టిస్ సంతోష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగంలో గృహ కొనుగోలుదారులు, ప్రమోటర్లు, ఏజెంట్లకు సంబంధించిన సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు, అవగాహన, ప్రాజెక్టు వివరాలు తదితర అంశాలపై సమాచారం, నివృత్తి, సహాయం కోసం ప్రత్యేక పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ (పీజీజీసీ) విభాగాన్ని రెరా ప్రారంభించింది.

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ &డెవలప్‌మెంట్) చట్టం, 2016 పరిధిలోకి వచ్చే వాటాదారులకు (గృహ కొనుగోలుదారులు, ప్రమోటర్లు/ బిల్డర్లు, ఏజెంట్లు) అవసరమైన మార్గదర్శకత్వం, ఖచ్చితమైన సమాచారం, ఫిర్యాదుల దాఖలులో సహాయ సహకారాలను అందించే ఏకైక, వ్యవస్థీకృత కేంద్రంగా ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ (పీజీజీసీ) ఏర్పాటు చేయబడిందని అథారిటీ పేర్కొన్నది. గృహ కొనుగోలుదారుల సంక్లిష్టతలను సులభతరం చేసేలా అవగాహన కల్పించడం, ఫిర్యాదుల పరిష్కారానికి స్పష్టమైన, సహాయక మార్గాన్ని అందించడంలో ఈ పీజీజీసీ ఒక కీలక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో రెరా చైర్మన్ డా. ఎన్. సత్యనారాయణ, మెంబర్లు జన్ను లక్ష్మీ నారాయణ, శ్రీనివాస రావు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్, డా. జనార్దన్ రెడ్డి, రెరా అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

Next Story