వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఊరట.. పరిహారంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఊరట.. పరిహారంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వదర బాధితులతో ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్ ప్రజలకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశాడని ప్రశంసించారు. కష్టం వచ్చినపుడు అండగా నిలబడే వాడే నిజమైన నాయకుడని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏ విపత్తు వచ్చిన ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా అని అన్నారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి ప్రజల ప్రణాలను కాపాడిందని తెలిపారు. తక్షణమే ఆ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేశామని గుర్తు చేశారు.

ప్రత్యక్షంగా ప్రజలు పడుతున్న కష్టాలు కష్టాలు, జరిగిన నష్టాన్ని చూసేందుకే కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో వరదతో నష్టం జరగకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాని అన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని రైతాంగానికి హామీ ఇచ్చారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రహదారులు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కావాల్సిన నిధులపై నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story