- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట.. సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డివిజన్ బెంచ్ కీలక తీర్పును ఇవాళ వెలువరించింది. గ్రూప్-1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే ధర్మాసనం కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్-1 నియామకాలు సక్రమమేనని.. పరీక్ష పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
అయితే, కాగా, గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా, జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది.
అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. అయితే, ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. అయితే, ఇవాళ వెలువడిన తుది తీర్పుతో 562 మంది గ్రూప్-1 అభ్యర్థులు త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.






