- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు ఊరట.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకే తొలి ప్రాధాన్యం.. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ హామీ
తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక మండలి (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యర్థులకు ఊరట లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక మండలి (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యర్థులకు ఊరట లభించింది. తొలుత అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని పూర్తి చేసిన తర్వాతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) స్పెషలిస్ట్ నియామకాలను చేపడతామని బోర్డు మెంబర్ సెక్రటరీ గోపీకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు (నోటిఫికేషన్ 03/2025), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు (నోటిఫికేషన్ 04/2025) వేలాది మంది అభ్యర్థులు ఉమ్మడిగా దరఖాస్తు చేసుకున్నారు. ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికైతే సీట్లు వృధా అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి మొదట డీఎంఈ నియామకాలు పూర్తి చేయాలని హెచ్ఆర్డీఏ శనివారం బోర్డుకు వినతిపత్రం సమర్పించింది. హెచ్ఆర్డీఏ వినతిపై సానుకూలంగా స్పందించిన గోపీకాంత్ పలు కీలక అంశాలను వెల్లడించారు. మొదట అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం నోటిఫికేషన్ నెం. 03/2025 ప్రకారమే భర్తీ ప్రక్రియ ముందుగా జరుగుతుందని హామీ ఇచ్చారు.
త్వరలో ప్రొవిజనల్ లిస్ట్..
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, మొత్తం నియామక ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల ద్వంద్వ ఎంపికలు తగ్గి, అర్హులైన మిగిలిన అభ్యర్థులకు సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు దక్కే అవకాశం మెరుగుపడుతుందని హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డా. కార్తీక్ నాగుల హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ చిక్కులు తొలగి పారదర్శకత పెరుగుతుందన్నారు.






