క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఊరట.. స్టెమ్ సెల్ థెరపీకి NMC గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 03:34:07  IST  )

భారత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు రానుంది. స్టెమ్ సెల్ థెరపీ వినియోగానికి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఊరట.. స్టెమ్ సెల్ థెరపీకి NMC గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో సరికొత్త ఆశలు చిగురించనున్నాయి. వైద్యరంగంలో అత్యంత అధునాతనమైన స్టెమ్ సెల్ థెరపీ వినియోగంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమోదించిన నిర్ధిష్టమైన వ్యాధులకు మాత్రమే ఈ చికిత్సను స్టాండర్డ్ ఆఫ్ కేర్ గా గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. స్టెమ్ సెల్ థెరపీ(మూలకణ చికిత్స) దెబ్బతిన్న కణజాలాలను లేదా అవయవాలను రిపేర్ చేయడానికి, భర్తీ చేయడానికి శరీరంలోని ప్రత్యేక మూలకణాలను ఉపయోగించే ఒక ఆధునిక వైద్యవిధానం. ఇది క్యాన్సర్, రక్త రుగ్మతలు, కీళ్ల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, అలాగే శరీర పునరుత్పత్తి ప్రక్రియలో కీలకంగా పనిచేస్తుంది. ఎన్ఎంసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రక్తానికి సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లకు ఈ చికిత్స అత్యంత కీలకం కానుంది. పెద్దలు, పిల్లల్లో ఏయే వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా వైద్యం అందించాలనే విషయాలపై మార్గదర్శకాలు రూపొందించారు. ఎన్ఎంసీ తీసుకున్న నిర్ణయం వైద్యరంగంలో పెనుమార్పుగా వైద్యులు భావిస్తున్నారు.

పెద్దల్లో 18 రకాల వ్యాధులు..

అక్యూట్ మైలోయిడ్ ల్యుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా, మైలోఫైబ్రోసిస్, మైలోడిస్ ప్లాస్టిక్ సిండ్రోమ్స్, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, డిఫ్యూజ్ లార్జ్ బీ-సెల్ లింఫోమా, ఫోలిక్యులర్ లింఫోమా, మాంటిల్ సెల్ లింఫోమా, పెరిఫెరల్ టీ-సెల్ లింఫోమా, హోడ్కిన్స్ లింఫోమా, మల్టిపుల్ మైలోమా, అక్వైర్డ్ సివియర్ అప్లాస్టిక్ అనీమియా, కాని స్టిట్యూషనల్ సివియర్ అప్లాస్టిక్ ఎనీమియా, అప్లాస్టిక్ ఎనీమియా/ పారొక్సిస్మల్ హీమోగ్లోబిన్ యూరియా, జెర్మ్ సెల్ ట్యూమర్స్, మల్టీ ఫుల్ స్లరోసిస్, సిస్టమిక్ స్క్లెరోసిస్ తదితర వ్యాధులను చేర్చారు.

పిల్లల్లో 14 రకాల వ్యాధులు..

అక్యూట్ మైలోయిడ్ ల్యుకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా, మైలోడిస్ ప్లాస్టిక్ సిండ్రోమ్స్, జువైనల్ మైలోమోనోసైటిక్ లుకేమియా, నాన్-హోడ్కిన్ లింఫోమా, హోడ్కిన్ లింఫోమా, ప్రైమరీ ఇమ్యునో డెఫిషియన్సీ డిసిజెస్, మ్యూకోపాలిసాకరైడోసెస్, తలసేమియా/సికల్ సెల్ డిసీజ్, ఆస్టియోపెట్రోసిస్, అక్వైర్డ్ సివియర్ అప్లాస్టిక్ అనీమియా, ఇన్ హెరిటెడ్ బోన్ మారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్, ఈవింగ్స్ సార్కోమా, న్యూరోబ్లాస్టోమా తదితర వ్యాధులను చేర్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు..

అటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ వంటి వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీని అనవసరంగా వాడకూడదని సుప్రీంకోర్టు జనవరి 1న ఇచ్చిన తీర్పును ఎన్ఎంసీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. కేవలం హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(హెచ్ఎస్సీటీ) మాత్రమే ఆమోదిత పద్ధతి అని, మెసెన్చైమల్ స్టెమ్ సెల్ చికిత్సను ఏ వ్యాధికి సిఫార్సు చేయడం లేదని స్పష్టం చేసింది. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు కేవలం ఆమోదించిన లిస్టులోని వ్యాధులకు మాత్రమే ఈ చికిత్స అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

వైద్యరంగంలో గేమ్‌ ఛేంజర్..

స్టెమ్ సెల్ థెరపీ అనేది దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్ చేయడానికి, వ్యాధిగ్రస్తులైన కణాలను ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేయడానికి ఉపయోగించే ఒక ఆధునిక వైద్యవిధానం. ఇవి శరీరంలో ఏ రకమైన కణాంగలైనా మారగలవు. క్యాన్సర్, గుండె జబ్బులు, నరాల వ్యాధుల చికిత్సకు ఇది కీలకమైంది. ఒకప్పుడు నయం కావు అనుకున్న వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీ ఒక వరం లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు. రోగి శరీరంలోని దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ చికిత్సలు అందుబాటులోకి వస్తే, దేశీయ వైద్యరంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మారనుంది. ముఖ్యంగా తలసేమియా, బ్లడ్ క్యాన్సర్ బాధితులకు ఇది పునర్ జన్మ లాంటిదని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story