- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖానామెట్‌లో గజాల లెక్కన అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లో అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లో అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయాల నుంచి అసైన్డ్ ల్యాండ్స్ కు నాలా కన్వర్షన్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ చట్టం, ఏ సెక్షన్ ప్రకారం వీటిని కన్వర్షన్ చేస్తున్నారో అంతుచిక్కడం లేదు. ఖానా మెట్ సర్వే నం.41లోని అసైన్డ్ భూములను సబ్ రిజిస్ట్రార్లు గజాల లెక్కన రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనల ప్రకారం ఈ భూముల క్రయవిక్రయాల పై నిషేధం ఉంది.
కానీ సర్వే నం.41/5లో జీపీఏ హోల్డర్ నుంచి 29 మంది కొనుగోలు చేసినట్లు శేరిలింగంపల్లి తహశీల్దార్ కి సంజాయిషీ అందింది. అది కూడా గజాల లెక్కనే కొనుగోలు చేసినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. అంతేకాకుండా సేల్ డీడ్, మ్యుటేషన్ చేయడం.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అనుమతుల జారీ పూర్తయ్యింది. అయితే అసైన్డ్ ల్యాండ్స్ ను ఎవరు కన్వర్షన్ చేశారు? ప్రొసీడింగ్స్ ఎవరి హయాంలో జారీ అయ్యాయి? వీటన్నింటినీ చూసిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్స్ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శేరిలింగంపల్లిలోనే ఎలా సాధ్యం?
రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు ఎక్కడ కూడా జరగడం లేదు. మరి శేరిలింగంపల్లి మండలంలో ఎలా సాధ్యమైందో అంతుచిక్కడం లేదు. ఏ చట్టం, ఏ సెక్షన్ ప్రకారం ఇది చేస్తారో తెలిస్తే.. మిగతా ప్రాంతాల అసైన్డ్ పట్టాదారులు కూడా చేయించుకోవడానికి వీలవుతుంది. భూ సేకరణలోనూ అసైన్డ్ ల్యాండ్స్ కు నష్టపరిహారం తక్కువగా ఇస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయించుకొని, లే అవుట్ లేకుండానే గజాల లెక్కన అమ్మేస్తే పరిహారం అత్యధికంగా పొందేందుకు వీలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ పక్కనేమో గజాల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, ఘట్ కేసర్.. సిటీ శివారు ప్రాంతాల్లోనేమో రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ పీవోబీ జాబితాలో నమోదు చేశారు. ఈ వ్యత్యాసం ఎందుకు అన్న దానిపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ సర్వే నం.41/5లో ఉన్నది పట్టా ల్యాండ్ అని అనుకున్నా.. రెవెన్యూ రికార్డుల్లో ఎకరాల లెక్కన ఉన్న భూమిని.. గజాల లెక్కన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులే మార్చేశారా? గజాల్లో సేల్ డీడ్స్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది.
ఏ అధికారి హయాంలో..?
ఖానా మెట్ సర్వే నం.41లోని అసైన్డ్/పట్టా భూమిని నాలా కన్వర్షన్ ఎవరి హయాంలో జరిగింది? ఫీజు ఎంత చెల్లించారు? స్పీకింగ్ ఆర్డర్ ఎవరు రాశారు? ఏ అధికారి సంతకంతో ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి? ఇవన్నీ తహశీల్దార్ కార్యాలయంలో ఉన్నాయా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలా కన్వర్షన్ లేకుండానే 29 మందికి సేల్ డీడ్స్ చేసి ఉంటే.. ఎలా సాధ్యమైందో, దీని వెనుక మతలబు ఏమిటో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ఖానామెట్ ల్యాండ్స్ లో ఒక అమర్ నాథ్ రెడ్డికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. మిగతా వారికి కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా చేయడం లేదు.
అమర్ నాథ్ రెడ్డి కొనుగోలు చేసినట్లుగానే మిగతా వాళ్లు కొన్నట్లయితే వాళ్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా! ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహశీల్దార్ లను అడ్డుకుంటున్నది ఎవరోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని మిగతా రెవెన్యూ గ్రామాల్లో ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగానే, అసైన్డ్ ల్యాండ్స్ లోని నిర్మాణాలను అడ్డుకుంటున్నట్లుగానే ఖానామెట్ లో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నాలా కన్వర్షన్ చేసినా, క్రయ విక్రయాలు సరైనవైతే ఏ చట్ట ప్రకారం సాధ్యమైందో క్లారిటీ ఇస్తే సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిషేధమున్నా.. అనుమతులు
ఖానామెట్ సర్వే నం.41లోని చాలా భూములు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనూ నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. అలాగే సర్వే నం.41/1 నుంచి 41/14 వరకు ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌లో నమోదు చేశారు. ఇందులో సర్వే నం.41/7 సీలింగ్ కాగా, 41/14 ప్రభుత్వానిదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఆ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయొద్దని పేర్కొన్నారు. కానీ కొనుగోలు, అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. డాక్యుమెంట్లు అయ్యాయి. అక్కడ ఎలాంటి లేఅవుట్ లేదు. కానీ ప్లాట్ల విక్రయం నడుస్తూనే ఉన్నది. నాటి నుంచి నేటి వరకు డాక్యుమెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కటే సర్వే నంబరులో కొన్నేమో ప్లాట్లుగా, మరికొన్ని గుంటల్లో డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. ఆ సర్వే నంబర్లన్నీ పీఓబీలో దర్శనమిస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలకు జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు తూట్లు పొడిచారు. ఇదే సర్వే నం.41/2, 41/5, 41/8, 41/9, 41/11, 41/12, 41/13 లో అనుమతులు ఇస్తూనే ఉన్నారు. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖలు రాసినా పట్టించుకోకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇంటి నంబర్లు దర్శనమిస్తున్నాయి. ఇవి అసైన్డ్ భూములైనా, పట్టా భూములైనా.. నాలా కన్వర్షన్ లేకుండా, లే అవుట్ అనుమతులు లేకుండా నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులపైనా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- Khanamet lands






