ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు నిరాకరణ.. హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ పేరిట ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నెల 8న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు పర్మీషన్ ఇచ్చేందుకు నిరాకరించారు.

ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు నిరాకరణ.. హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ పేరిట ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నెల 8న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు పర్మీషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. సభకు అనుమతించాలని సమాఖ్య ప్రతినిధులు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. నగరంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అనుమతిని నిరాకరిస్తూ ఇవాళ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతులిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే, భోజన విరామం తర్వాత ఆ పిటిషన్‌ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్ బకాయిల చెల్లిపులపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. గురువారం కళాశాలల బంద్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ మొదటి, రెండో సెమిస్టర్‌ పరీక్షలు కేవలం కొన్ని కాలేజీల్లో మాత్రమే జరిగాయి. అందులోనూ కొన్ని యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలే ఉన్నాయి. మిగిలిన కళాశాలలు పరీక్షలను బహిష్కరించాయి. ఉదయం సెకండ్ సెమిస్టర్‌కు 7,848 మందికి 916 మంది(11.67 శాతం), మధ్యాహ్నం తొలి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 2,066 మందికి 154 మంది (7.45 శాతం) హాజరయ్యారు. నాలుగో రోజు బంద్‌ విజయవంతమైందని, దాదాపు 2 వేల కళాశాలలు పనిచేయలేదని సమాఖ్య నేతలు తెలిపారు.

Next Story