Indiramma sarees: సోషల్ మీడియాలో ఇందిరమ్మ చీరలతో రీల్స్ ట్రెండ్.. కాగ్రెస్ శ్రేణుల ఫుల్ ఖుషీ

by Prasad Jukanti |   (  Updated:2025-11-26 08:07:56  IST  )

రైతు రుణమాఫీ చేసినా ఇంత ట్రాక్షన్ రాలేదని ఇందిరమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి.

Indiramma sarees: సోషల్ మీడియాలో ఇందిరమ్మ చీరలతో రీల్స్ ట్రెండ్..  కాగ్రెస్ శ్రేణుల ఫుల్ ఖుషీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇందిరమ్మ చీరల ట్రెండింగ్ నడుస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం తరఫున సారె కింద ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతంలో నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ చీరల పంపిణీ కొనసాగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ఇందిరమ్మ చీరలు అందుకున్న మహిళలు ఈ చీరలను కట్టుకుని సోషల్ మీడిాయలో రీల్స్, ఫోటోలు షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందిరమ్మ చీరల ట్రెండ్ నడుస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల భార్యలు సైతం ఈ ఇందిరమ్మ చీరలను కట్టుకుని ఫోటోలు దిగడం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీరలపై ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న సిట్యుయేషన్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాన్ని మరింత హాట్ హాట్ గా మారుస్తోంది.

రుణమాఫీతో రాని ట్రాక్షన్ ఇందిరమ్మ చీరలతో:

ఇందిరమ్మ చీరలు ధరించిన ఓ మహిళ బృందం చేసిన రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మహిళలంతా ఇందిరమ్మ చీరను కట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిన పథకాలను వివరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డు లబ్ది దారులకు సన్నిబియ్యం పంపిణీ పథకాలను వివరించారు. (వీడియో) ఇక మరి కొంత మంది ఇందిరమ్మ చీరలను కట్టుకుని ట్రెండింగ్ సాంగ్స్ కు చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి (వీడియో). దీంతో 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన కూడా రాని ట్రాక్షన్ ఇందిరమ్మ చీరలతో వస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.

బీఆర్ఎస్ విమర్శలు:

ఇక ఇందిరమ్మ చీరల విషయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోందని దుయ్యబడుతోంది. ప్రభుత్వం రెండు చీరలు ఇస్తామని చెప్పి ఒకటే చీర పెట్టి సారె పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తానన్న హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం చీర ఇచ్చి కాంగ్రెస్ చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. పట్టణాల్లో ఎన్నికలు లేవు కాబట్టే అక్కడ చీరలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ ఓట్లు రాల్చేనా?:

సర్పంచ్ ఎన్నికల వేళ ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పథకం సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. పోలింగ్ రోజున మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకుని ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వైబ్ చూస్తుంటే ఈ ప్రచారం ప్రభుత్వానికి అనుకూలం కాబోతున్నదని అధికార పార్టీ అంచనాలు వేసుకుంటుంటే, కేవలం చీరలకే ఓట్లు వేస్తారనుకుంటే అది వట్టి భ్రమే అవుతుందని ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి ఓట్లు రాల్చబోతోంది? అసలు రాష్ట్రంలోని అక్కా చెల్లెల్ల ఆశీస్సులు ఎవరిమీద ఉండబోతున్నాయి? అనేది డిసెంబర్ 17తో తేలిపోనుంది.


Next Story