రెడ్ల సహాయం లేకుండా మీరు బతకగలరా? బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవరెడ్డి చాలెంజ్

by Prasad Jukanti |   (  Updated:2025-10-14 07:27:35  IST  )

బీసీ రిజర్వేషన్ల అంశంలో బీసీలు వర్సెస్ రెడ్ల మధ్య వివాదం ముదురుతోంది.

రెడ్ల సహాయం లేకుండా మీరు బతకగలరా? బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవరెడ్డి చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం (BC Reservation Issue) రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జీవోపై హైకోర్టు స్టే విధించడానికి కారణం మీరంటే మీరు అంటూ ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ జీవోను హైకోర్టులో చాలెంజ్ చేసిన రెడ్డి జాగృతి మాధవరెడ్డి (Madhav Reddy) తాజాగా బీసీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‍‍తో మాట్లాడిన ఆయన.. 50 శాతం సీలింగ్ బ్రేక్ చేసి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ రాష్ట్రం ముందుకు వచ్చినా, అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఓడిపోయాయని, బీసీ నాయకులు ఈ విషయాన్ని చెప్పకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రెడ్లను ఓట్లు అడగం, రెడ్ల వద్దకు పోమని చాలామంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి చాలెంజ్ చేస్తున్నానని, ‘ఏ బీసీ నాయకుడైనా మేము రెడ్ల వ్యాపారులు, రెడ్ల నాయకుల వద్ద డబ్బులు అడుకోక్కుండా సంస్థలు నడుపుతామని అనగలరా?’ అని ప్రశ్నించారు. కేవలం మీ బతుకుదెరువు కోసం సంఘాలు పెట్టి రెడ్లను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తెల్లారితే రెడ్ల వద్ద ఆశీస్సులు, డబ్బులు తీసుకుని మళ్లీ రెడ్లనే విమర్శిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ తప్పంతా తమ రెడ్డిలదేనని, తాము చేరదీశామని కానీ ఇలాంటి చీడపురుగులు ఉంటాయని ఆలోచించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్లు అంటే సమాజం మేలు కోరేవారమని పేర్కొన్నారు.

మున్నూరుకాపులకు రిజర్వేషన్లు ఎందుకు?..

భారత రాజ్యాంగంలో తొలుత ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఆ తర్వాత బీసీలకు జనాభా పరంగా కాకుండా ఆర్థిక పరంగా రిజర్వేషన్లు కల్పించారని మాధవరెడ్డి చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అంటున్నారు.. ఒక వేళ దేశంలో ముస్లింల జనాభా పెరిగితే పెరిగిన జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లే లేవని, ఆర్థిక అసమానతల ఆధారంగానే వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఇంద్రాసహానీ కేసులో స్పష్టంగా చెప్పారన్నారు. 1970కి ముందు మున్నూరు కాపులు (Munnuru Kapu) ఓసీలలో ఉన్నారని ఆ తర్వాత వారిని బీసీల్లో చేర్చారని చెప్పారు. నిజానికి వీరు ఆర్థికంగా, రాజకీయంగా మంచి స్థాయిలోనే ఉన్నారని, మరి వీరికి రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించారు. బీసీలకు వచ్చే ఫలాలన్నీ మున్నూరు కాపులే తీసుకుంటున్నారని ఆరోపించారు. మిగతా బీసీ కులాలకు రిజర్వేషన్లకు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు.

మాధవరెడ్డితో మాకు సంబంధం లేదు..

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డికి తమకు సంబంధం లేదని రెడ్డి జాగృతి (Reddy Jagrithi) వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మరో యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. మాధవరెడ్డి గతంలో రెడ్డి జాగృతి విద్యార్థి విభాగంలో పని చేసేవారని, ఆ తర్వాత తమతో విభేధించి వేరేగా పని చేస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ వల్ల బీసీలు, రెడ్ల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయన్నారు. వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లినవారిని పట్టుకుని రెడ్డి సమాజాన్ని దోషులుగా చిత్రీకరిస్తూ గ్రామాల్లో ఉన్న మంచి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Next Story