తెలంగాణలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు..

by Ramesh Naini |

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. డిమాండ్ విపరీతంగా పెరిగినా చమురు సంస్థలు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తున్నాయి.

తెలంగాణలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. డిమాండ్ విపరీతంగా పెరిగినా చమురు సంస్థలు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సిలిండర్ల లభ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ రంగాల నుంచి ఇంధనానికి డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ, సప్లై ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో రబీ పంటల కోతలు, ముమ్మరంగా సాగుతున్న ధాన్యం కొనుగోలు కార్యకలాపాల వల్ల వ్యవసాయ, రవాణా రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు, ఇతర ప్రైవేటు సంస్థల కంటే ప్రభుత్వ రంగ బంకుల్లో ధరలు అందుబాటులో ఉండటంతో సాధారణ వినియోగదారులతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు కూడా ప్రభుత్వ రంగ రిటైల్ అవుట్‌లెట్ల వైపే మొగ్గు చూపుతున్నాయి.

మే నెలలో భారీ వృద్ధి..

గతంతో పోలిస్తే మే నెలలో తెలంగాణలో ఇంధన విక్రయాలు రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. డీజిల్ (రిటైల్) అమ్మకాలు ఏకంగా 12.6 శాతం, పెట్రోల్ (రిటైల్) అమ్మకాలు 9 శాతం పెరిగాయి. ఇది సాధారణ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ప్రభుత్వ రంగ బంకుల ద్వారా డీజిల్ అమ్మకాలు 25 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. మరో 12 జిల్లాల్లో ఈ వృద్ధి 15 నుంచి 25 శాతం మధ్యలో ఉంది. కేవలం మే నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను చమురు సంస్థలు పంపిణీ చేశాయి. పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిరంతరం స్టాక్ స్థాయిలను సమీక్షిస్తున్నాయి. రవాణా, పంపిణీ ప్రణాళికలను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి నిరంతరాయంగా సరఫరాను కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు భరోసా ఇస్తున్నాయి. మరోవైపు ఇంధన లభ్యతకు సంబంధించిన తాజా, కచ్చితమైన సమాచారం కోసం కేవలం చమురు మార్కెటింగ్ సంస్థలు, అధికారిక వర్గాలు జారీ చేసే ప్రకటనలనే నమ్మాలని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని పేర్కొన్నారు.

Next Story