- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కలిసొచ్చిన రాఖీ పౌర్ణమి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్ హ్యాపీ
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ఆర్టిసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ఆర్టిసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ(Rakhi Festival) నాడు ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయగా.. ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 53 లక్షల కిలో మీటర్లను అదనంగా సంస్థ తిప్పింది.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుని ఉచితంగా రాకపోకలు సాగించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సోదర, సోదరీమణుల బంధం ఎంత గొప్పదో ఈ రాఖీ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సంస్థ సామర్థ్యాన్ని అంతా ఉపయోగించుకుని రాఖీ పండుగకు రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాఖీ పండుగను త్యాగం చేసి, భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని వారి సేవలను కొనియాడారు. విపరీతమైన రద్దీలోనూ మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు.
ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్దతతో పనిచేయడం వల్ల రాఖీ పండుగకు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ రాఖీ పండుగ ఆపరేషన్స్ సంస్థలో సరికొత్త రికార్డులను నమోదు చేసిందని, ఈ నెల 11న ఒక్క రోజులో అత్యధికంగా 68.45 లక్షల మంది ప్రయాణించారని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి ఈ రాఖీ పండుగ రికార్డులే నిదర్శనమన్నారు. టీజీఎస్ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్తను ఆదరిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.






