సీఐడీ విచారణకు సిద్ధమా రేవంత్ రెడ్డి?: కేటీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-23 10:28:50  IST  )

గ్లోబరీనా సంస్థ నాదే అయితే అలాంటి సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు.

సీఐడీ విచారణకు సిద్ధమా రేవంత్ రెడ్డి?: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబరీనా సంస్థ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని, ఆ సంస్థ తన బినామీ సంస్థ అని ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తనపై చేసిన చేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయంలో తాను లై డిటెక్టర్ పరీక్షతో పాటు సీఐడీకి విచారణకు సిద్ధమని మరి రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడి విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ నిజంగానే నా బినామీ సంస్థే అయితే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఇవాళ వరంగల్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్‍చాట్‍లో మాట్లాడారు.

రాజ్ భవన్ ముందు చేయాల్సిన ధర్నా కొడంగల్‍లోనా?:కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించరని, రేవంత్ రెడ్డి మోడీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారని విమర్శించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమేనన్నారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‍తో, రాత్రి బీజేపీతో ఉంటారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‍కు ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని, కాంగ్రెస్‍కు ఒకటి, బీజేపీకి రెండు మూటలు ఇదే రేవంత్ రెడ్డి పాలన అన్నారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Next Story