కేదార్ డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం..! మృతి‌పై వీడని అనుమానాలు

by Kema Shiva Kumar |

సినీ నిర్మాత కేదార్ సలగంశెట్టి మృతిపై సస్పెన్ష్ కొనసాగుతోంది.

కేదార్ డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం..! మృతి‌పై వీడని అనుమానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నిర్మాత కేదార్ సలగంశెట్టి మృతిపై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఆయనెందుకు మృతి చెందారన్న మిస్టరీ బయటపడలేదు. దుబాయిలో కేదార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ మరణాల విషయంలో దుబాయి పోలీసులు 24 గంటల్లో డెడ్‌బాడీలను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. కేదార్ మృతిపై అలాంటి విధానమేదీ కనిపించకపోవడంతో పలువురిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేదారి మృతి చెందినప్పుడు ఎవరున్నారు అనే అంశం నిర్ధారణ కాలేదు. దుబాయి నుంచి ఇండియాకు కేదార్ మ‌ృతదేహం ఎప్పడు వస్తుంది? అన్న విషయంపై క్లారిటీ లేదు. కేదార్ మృతిచెంది నాలుగు రోజులు దాటినా.. దుబాయి పోలీసులు కారణాలను బయటపెట్టలేకపోతున్నారు. దుబాయిలో ఓ వేడుకకు హజరైన సమయంలో తన ఫ్లాట్లో ఆయన మృతి చెందారు.

కేదార్ మృతిపై అనుమానాలు

రాడిసన్ హోటల్ జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు విచారణ తుదిదశకు చేరుకున్న సమయంలో కేదార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. దుబాయిలో కేదార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేదార్ కుటుంబ సభ్యులు కోరితే విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. చాలామంది ప్రముఖులతో కేదార్‌కు లావాదేవీలు ఉన్నట్టు సమాచారం. సినీ పరిశ్రమకు చెందిన కొందరితో దుబాయిలో కేదార్ పెట్టుబడులు పెట్టించినట్టు తెలుస్తోంది. కేదార్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నవారంతా ప్రస్తుతం ఏం చేయాలా తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ప్రముఖుల లావాదేవీలు

ప్రాపర్టీ డాక్యూమెంట్లు ఇండియాకి తెప్పించుకోవాలా? దుబాయిలోనే ఉంచాలా అన్న సందిగ్ధంలో మరికొందరు ఉన్నారు. వ్యాపార ప్రముఖులతోపాటు కొందరు రాజకీయ ప్రముఖులు కేదార్‌తో టచ్‌లో ఉండేవారిని నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో చాలామంది ప్రముఖులు కేదార్‌తో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారని భోగట్టా. ఆ లావాదేవీలే తమను కొంపముంచేలా ఉన్నాయని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. కేదార్ సంబంధించిన ఫోన్, ఇతర డ్యాక్యూమెంట్లు ఆయన కుటుంబ సభ్యులకు భద్రంగా చేరితే తప్ప చిక్కుముడులు వీడే పరిస్థితి కనిపించడం లేదు. అంతవరకూ.. చాలా‌మంది ప్రముఖులు కంటిమీద కునుకు తీసే పరిస్థితి లేదు.

Next Story