దెబ్బతిన్న రోడ్లపై R&B ఫుల్ ఫోకస్! క్షేత్ర స్థాయి పరిశీలనలో అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల అధ్యయనంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

దెబ్బతిన్న రోడ్లపై R&B ఫుల్ ఫోకస్! క్షేత్ర స్థాయి పరిశీలనలో అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల అధ్యయనంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలో అరకొర నిధులు కేటాయించి పైపై మెరుగులతో రోడ్లు వేసి వదిలేయడం, మరికొన్ని చోట్ల టెండర్లు పిలిచినా సరైన నిధులు కేటాయించలేదంటూ, చాలా చోట్ల టెండర్లు ఫైనల్​కాక వదిలేసిన క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​సర్కారు ఈ సారి రహదారులను పక్కాగా బాగు చేయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ 2,923 కి.మీ.ల రాష్ట్ర రహదారులను నిర్వహిస్తోంది. 2,143 కి.మీల పొడవుతో కిందటి ఏడాది రోడ్ల పనులను పునరుద్దరించిన సర్కార్​ఈ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 828.45 కోట్ల బడ్జెట్​ను వినియోగించుకుని సుమారు 3వేల కిలో మీటర్ల రాష్ట్ర రహదారులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరమ్మతులకు కనీసం రూ. 1500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ఇప్పటికే సర్కారుకు సమాచారం ఇవ్వగా, దశల వారీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామాల నుండి మండలానికి, మండలం నుండి జిల్లాలకు వచ్చే రోడ్లు రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ రోడ్లు ఎప్పుడు బాగు చేయిస్తారంటూ గ్రామీణ ప్రాంత వాసులు ప్రభుత్వ ప్రజా ప్రతినిధులను నిలదీస్తూ వస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల నుండి మొదలుకొని శాసనసభ్యులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పనులు చేయిస్తామంటూ ప్రజాప్రతినిధులు స్థానికులను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల శాసనసభ వేదికగా ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్​ను ఓకే చేయించుకున్న నేపథ్యంలో పనులు ఇక చకచకా చేయించేందుకు ఆర్​అండ్​బి శాఖ చర్యలు చేపడుతోంది.

ముఖ్యంగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేయడంతో డివిజన్ల వారీగా గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపడుతున్నారు. ఈ రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయి ఎన్ని కిలో మీటర్ల మేరకు తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉంది తదితర సమాచారాన్ని నెల రోజుల్లో సిద్ధం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం ఈ రోడ్లకు అయ్యే ఖర్చు అంచనాలను రూపొందించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లను పిలిచి యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేయించాలన్న ఆలోచనలో అధికారుల ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో వర్షాకాలం కంటే ముందే పనులు అత్యవసరంగా చేపట్టే అవకాశం ఉంది.

వర్షాకాలం వస్తే వర్షాల ఉధృతి పెరుగుతుందని , అప్పుడు ఈ ఎండా కాలం మాదిరి రోడ్లు వేయడం కుదరదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గత బీఆర్ఎస్​హయాంలో వేసిన రోడ్లు పాడైనా గానీ నాటి సర్కార్​ పట్టించుకోలేదని స్థానికుల నుండి ఫిర్యాదులు వస్తుండడంతో ఈ సారి అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. నిజానికి రోడ్లు వేయించే కాంట్రాక్టర్లకే ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత తప్పని సరిగా కనీసం 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ రోడ్లు పాడైతే గనుక కనీసం గుంతలను అయినా పూడ్చక తప్పని అనివార్య పరిస్థితి ఉంటుంది. కాగా, ఈ పనులను కూడా గత సర్కారు హయంలో పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని గ్రామీణ రోడ్లు పాడై ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా గత సర్కారు పెద్దలు రోడ్ల గురించి కాకుండా రైతు బంధు లాంటి కార్యక్రమాలకే ప్రాధాన్యతనిచ్చి వాటికే నిధులు ఎక్కువగా కేటాయిస్తు రావడంతో రహదారుల గురించి ఆలోచించే పరిస్తితే లేక పోయిందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం.

నెల రోజుల్లోనే వివరాలు వెల్లడి

ఇదిలా ఉంటే దెబ్బతిన్న రోడ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి కేవలం నెల రోజుల్లోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ దిశగా రోడ్లు భవనాల శాఖ అధికార వర్గాలు కార్యాచరణను రూపొందిస్తున్నాయి. మండలాలు, జిల్లాల వారీగా సమాచారం తెలుసుకుని ఆ దిశగా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా రోడ్లు పాడైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత జిల్లా కావడంతో అధికారులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. రెండో స్థానంలో ఆదిలాబాద్​జిల్లా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలోనూ గత సర్కారు హయాంలో పెద్దగా రోడ్లు వేసినట్లు లేదని తెలుస్తోంది. ఈ విధంగా జిల్లాల వారీ సమాచారం తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించనున్నారు.

Next Story