ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది: మంత్రి ఉత్తమ్

by Bhanu |   (  Updated:2025-07-11 08:17:47  IST  )

స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప ఘట్టంగా నిలవబోతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది: మంత్రి ఉత్తమ్
X

దిశ, తుంగతుర్తి/అర్వపల్లి: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప ఘట్టంగా నిలవబోతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతుందని పేర్కొంటూ, ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందుతున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో పేదలు తినలేని బియ్యం పంపిణీ చేశారని విమర్శిస్తూ, ఇప్పుడు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి న్యాయం జరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును పూడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 1.04 లక్షల అన్యుమినేటర్లతో కులగణన చేపట్టిన ఘనత కూడా తమదేనని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తాము చేపట్టిన సబ్‌కమిటీ పనులు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభావం చూపనున్నాయని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలియజేస్తూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఆర్డినెన్స్‌ను గుర్తు చేశారు. గతంలో ఎలాంటి ప్రభుత్వం ఇది సాధించలేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో హుజూర్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీ, తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ రెండు ముఖ్య ఘట్టాలుగా నిలిచిపోయాయని వ్యక్తిగతంగా ఆనందం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లాల పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఇప్పుడు అమలవుతున్న ఆరు గ్యారంటీలు ప్రజలకు కంటకంగా కాకుండా, కొండంత భరోసాగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Next Story