నిమ్స్ వైద్యుల ఔన్నత్యం.. అరుదైన వ్యాధికి ఫ్రీ సర్జరీ

by Naga Rani Yarlagadda |

అరుదైన వ్యాధితో బాధపడుతున్న రోగికి హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి అతని ప్రాణాలు కాపాడారు.

నిమ్స్ వైద్యుల ఔన్నత్యం.. అరుదైన వ్యాధికి ఫ్రీ సర్జరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అరుదైన వ్యాధితో బాధపడుతున్న రోగికి హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. రూ.లక్షలు విలువైన సర్జరీని పూర్తిగా ఉచితంగా చేసి రోగి ప్రాణాలకు భరోసానిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ శివప్రసాద్‌రావు ఏడాదికి పైగా పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల ధమనుల్లో నిరంతరం రక్తం గడ్డకట్టడం ఈ వ్యాధి లక్షణం. ఇది ఊపిరితిత్తుల్లో ప్రమాదకరమైన అధిక రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్)కు దారి తీస్తుంది. దీంతో తీవ్రమైన ట్రైకస్పిడ్ రెగర్జిటేషన్ (లీకీ హార్ట్ వాల్వ్)తో కలిసి ప్రాణపాయ స్థితిని తెచ్చిపెడుతుంది.

నిమ్స్‌ ఆస్పత్రిలో ఆపరేషన్ సక్సెస్

అరుదైన వ్యాధిని నయం చేసేందుకు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు కష్టపడి ఆపరేషన్ చేశారు. పల్మనరీ ధమనుల్లో దీర్ఘకాలిక రక్తం గడ్డకట్టడాన్ని సున్నితంగా తొలగించడంతో పాటు ప్రత్యేకమైన హార్డ్ ఫెల్ట్‌ను ఉపయోగించి ట్రైకస్పిడ్ వాల్వ్‌కు చికిత్స చేశారు. ఈ ఆపరేషన్‌ నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొ.అమరేష్ పర్యవేక్షణలో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ సూర్య సత్య గోపాల్ విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

సర్జరీ పూర్తిగా ఉచితం

ఇటీవల ఆరు సంక్లిష్టమైన పల్మనరీ ఎండార్టెరెక్టమీ కేసులను విజయవంతంగా పూర్తి చేశామని నిమ్స్ డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప తెలిపారు. రూ.6 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పూర్తిగా ఉచితంగా చేసినట్టు వెల్లడించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Next Story