బైక్ ఎక్కడని తండ్రి అడిగాడని పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణం

by Kodari Anjali |

మద్యానికి బానిస కావడమే కాకుండా, బైక్ ఏమైందని తండ్రి నిలదీసినందుకు మనస్తాపానికి గురైన ఓ వివాహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

బైక్ ఎక్కడని తండ్రి అడిగాడని పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణం
X

దిశ, మర్పల్లి: మద్యానికి బానిస కావడమే కాకుండా, బైక్ ఏమైందని తండ్రి నిలదీసినందుకు మనస్తాపానికి గురైన ఓ వివాహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మర్పల్లి మండల కేంద్రంలోని దామస్తాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామస్తాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల బలవంత రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి (33)గత కొంతకాలంగా తీవ్రంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అతడి వద్ద ఉన్న బైక్ కనిపించకుండా పోయింది. దీంతో తండ్రి బలవంత్ రెడ్డి శనివారం (ఈనెల 4న) కుమారుడిని పిలిచి, "బైక్ ఎక్కడ పోగొట్టావు అని గట్టిగా నిలదీశాడు. తండ్రి ప్రశ్నించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసింహారెడ్డి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నరసింహారెడ్డి మృతి చెందాడు. మృతుడి భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మర్పల్లి ఎస్సై అబ్దుల్ రాహుఫ్ తెలిపారు.

Next Story