‘దిశ’ కథనంతో వెలుగులోకి..! ఎవరా ‘మార్వాడీ’! సర్కారు భూములే ఆయన టార్గెట్‌

by Ramesh Naini |

సర్కారు భూములే మార్వాడీ టార్గెట్‌. వాటిని ఆక్రమించేందుకు పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేస్తారు.

‘దిశ’ కథనంతో వెలుగులోకి..! ఎవరా ‘మార్వాడీ’! సర్కారు భూములే ఆయన టార్గెట్‌
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/ కడ్తాల్‌ : సర్కారు భూములే ఆయన టార్గెట్‌. వాటిని ఆక్రమించేందుకు పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేస్తారు. అధికారులను మేనేజ్‌ చేసుకుని ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేయించుకుంటారు. ఆ తర్వాత ఆ భూములకు పట్టాలు పొంది ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలిపేసుకుంటారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలో అక్రమ పట్టాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నకిలీ పట్టాల అక్రమంలో ప్రముఖంగా ఓ మార్వాడీ పేరు అందరి నోటా వినిపిస్తోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మడం ఆయనకు ‘కోడి పిల్లలను కొన్నంత సులువు’ అన్న టాక్‌ స్థానికంగా విన్పిస్తోంది. ఆయన బాగోతంపై అనేక ఫిర్యాదులు రెవెన్యూ అధికారులకు అందినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూములన్నీ ఆయన గుప్పిట్లోనే..

కడ్తాల్‌ మండలం కర్కల్‌ పహాడ్‌ రెవిన్యూ పరిధిలోనే అక్రమ పట్టాల వ్యవహారం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి అక్రమాలపైనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఓ రైతు నుంచి కొనుగోలు చేసిన భూమి కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని రికార్డుల్లోకి ఎక్కించుకున్న విషయంపైన కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. సర్వే నెం.52/26/ఈ లో 1.30 ఎకరాలను హైదరాబాద్‌ కు చెందిన మార్వాడీ కొనుగోలు చేశాడు. బై నెంబర్(52/26/ఈ/1) సృష్టించి అదనంగా 2 ఎకరాలను రికార్డుల్లోకి అక్రమంగా ఎక్కించుకున్నారని బాధిత రైతు ఈ ఏడాది జూలై నెలలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే కర్కల్‌ పహాడ్‌ లోని అనేక సర్వే నెంబర్లలో వాస్తవికంగా ఉన్నదానికంటే అధిక విస్తీర్ణాన్ని చూపించి అక్రమ పట్టాలను పొందటం ద్వారా ప్రభుత్వ భూములను మార్వాడీ కాజేశారంటూ స్థానిక నేత ఒకరు గత జూన్‌ నెలలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 12.28 ఎకరాలకు అక్రమ పట్టాను పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మార్వాడీ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అక్రమంగా పొందినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

విచారణపై రైతుల్లో ఎన్నో సందేహాలు..

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలో జరిగిన అక్రమ పట్టాల వ్యవహారంపై ‘దిశ’ పత్రికలో ‘కన్నేసి..కలిపేసి’! శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనం స్థానికంగా వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. దీనిపై రెవెన్యూ శాఖ స్పందించింది. తహసీల్దార్‌ జయశ్రీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కర్కల్‌ పహాడ్‌ లోని వివాదాస్పద భూముల ప్రాంతాన్ని సందర్శించారు. అయితే ఈ పరిశీలన సందర్భంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసలైన పట్టాదారులు ఆవేదన చెందుతున్నారు. సర్వే నెం.52 లో పట్టా, లావుణి భూములతో పాటు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 52/27, సర్వే నెం.52/28 లతో పాటు పలు సర్వే నెంబర్లలోని కొంత భూమిని గతంలో ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయగా..వారు సాగు చేసుకుంటున్నారు.

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్వాడీ సైతం సర్వే నెం.52లోనే వివిధ నెంబర్లతో అక్రమ పట్టాలు పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లిన రెవెన్యూ అధికారులు మార్వాడీకి సంబంధించిన భూముల్లో విచారణ చేయకుండా..తమ పట్టా భూముల్లో సర్వే చేస్తున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక సర్వే నెంబరుతో పట్టా పొంది మరో చోట మార్వాడి పొజిషన్‌ చూపిస్తున్నాడని.. ఈ దిశగా విచారణ చేయకుండా తమ పట్టా భూముల్లో విచారణ జరపడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగు చేసుకుంటున్న పట్టాదారులకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు.

Next Story