- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ సారు.. ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేదెప్పుడు ?
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్ వాద్ గ్రామంలో సాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యవహారం ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది

దిశ, కొడంగల్ : నిబంధనలు కాగితాలకే పరిమితం.. అధికారుల పర్యవేక్షణ ప్రహసనం.. వెరసి కొందరు అక్రమార్కులకు కాసుల పంట, సామాన్య ప్రజలకు కన్నీటి కుంట ! వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్ వాద్ గ్రామంలో సాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యవహారం ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్లుగా అనుమతులు లేకుండా, కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిబంధనలను తుంగలోతొక్కి సాగుతున్న ఈ దందా.
నివేదిక ఉంది.. కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ?
ఈ అక్రమ దందా పై కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ గళమెత్తడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. దౌల్తాబాద్ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, హైదరాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి ఎలాంటి లైసెన్సులు లేకుండా, చట్ట విరుద్ధంగా బట్టీలు నిర్వహిస్తున్నట్లు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక తాండూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరి రోజులు గడుస్తున్నా, సదరు యజమాని పై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడం వెనుక ఉన్న 'అదృశ్య హస్తం' ఎవరిది ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పొగచూరిన పల్లె.. రోగాల గుప్పిట్లో ప్రజలు !
గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ బట్టీల నుండి నిరంతరం వెలువడే నల్లటి పొగతో గోకఫసల్ వాద్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ విషపూరిత పొగ ఊరు ఊరంతా కమ్మేస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోలేక అల్లాడిపోతున్నారు. గ్రామంలో ఇప్పటికే చాలా మందికి శ్వాసకోస వ్యాధులు, వింత చర్మ వ్యాధులు సోకుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే అక్రమార్కుల లాభాలే ముఖ్యామా అని గ్రామస్తులు కలెక్టర్ ని ప్రశ్నిస్తున్నారు.
నేలతల్లికి తీరని ద్రోహం !
ఇటుకల తయారీ కోసం భూగర్భ జలాలను అడ్డూ అదుపు లేకుండా తోడేయడంతో కొనసాగుతున్న ఇటుక బట్టీల సాగు భూములు ఎడారిగా మారుతున్నాయి. మైనింగ్ శాఖకు పన్నులు చెల్లించకుండా, భూసారాన్ని నాశనం చేస్తూ సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి కొడుతోంది. ఇంత జరుగుతున్నా మైనింగ్, పర్యావరణ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
కలెక్టర్ సారూ స్పందించాలి !
అక్రమ ఇటుక బట్టీల యజమానులు నోటీసులను బేఖాతరు చేస్తూ, కాలయాపన చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, తహసీల్దార్ నివేదిక ఆధారంగా ఆ అక్రమ బట్టీలను తక్షణమే సీజ్ చేయాలని, గోకఫసల్ వాద్ గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.






