శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

by Taduka Kalyani |

శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ నిర్వహణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారులు పలు విభాగాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, అధికారిక రికార్డులు, కార్యాలయ వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సేవల అమలు తీరు, పరిపాలనా విధానాలు, దస్త్రాల నిర్వహణపై అధికారులు సమగ్రంగా ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే కొన్ని అంశాలపై సంబంధిత సిబ్బందిని వివరణలు కోరినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అధికారులు సమర్పించే నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

Next Story