- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం పూర్తయితే జలగండమే: హరీష్ రావు
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు హరీశ్‌రావు లేఖ రాశారు...

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు హరీశ్‌రావు లేఖ రాశారు. భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు ఈ లేఖను పినపాక, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు అందించారు. పోలవరం నిర్మాణంతో కేవలం ముంపు గ్రామాలకే కాదని.. పరిశ్రమలకు సైతం బ్యాక్ వాటర్ ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే.. పదేపదే ముంపునకు గురవుతున్న బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించడమే కాకుండా శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద తక్షణమే కరకట్టల నిర్మాణం చేపట్టాలని.. అక్కడే పీపీఏ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. పోలవరం పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా అదే 45.72 మీటర్లు కావడం గమనార్హమని పేర్కొన్నారు.
దీంతో ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ఎల్లప్పుడూ ముంపు ప్రమాదమేనని తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నది లోతైన బెడ్ లెవల్ 26 మీటర్లు కాగా, పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిలిచి ఉంటుందని తెలిపారు. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత వచ్చిన బ్యాక్ వాటర్‌తో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాకల్లో భారీ నష్టం వచ్చిందని.. 40 శాతం జలమయమైన భద్రాచలం పట్టణం, లక్ష మందికి పైగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. 2022లో 22 లక్షల క్యూసెక్కులకే ఇంత నష్టం జరిగితే, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేవలం గ్రామాలకే కాకుండా దాదాపు 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు.
ఈ పరిశ్రమలతోపాటు 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతున్నట్లు ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. పదేపదే నష్టపోతున్న సుమారు 2వేల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారంతోపాటు పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్ వాటర్ ముప్పును ఎదుర్కొంటున్నాయని.. వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని సూచించారు.






