కోకాపేట కురుమ భవనాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదు

by Taduka Kalyani |

కోకాపేట కురుమ భవనాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదు
X

దిశ, గండిపేట: కోకాపేటలోని తెలంగాణ కురుమల ఆత్మగౌరవ భవనాన్ని ఎవరికీ లీజ్ ఇవ్వలేదని, కురుమ సమాజ అభివృద్ధి కోసమే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. కోకాపేట తెలంగాణ కురుమల ఆత్మగౌరవ భవనంలో గురువారం ఆయన పలువురు రాష్ట్ర నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కురుమ సంఘం ఎల్లప్పుడూ విద్యార్థులు, కుల బంధువుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందన్నారు. కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ సమాజంలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనపై సోషల్ మీడియాలో లేనిపోని నిరాధార విష ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేటలోని కురుమ భవనాన్ని మరింత అభివృద్ధి చేసి, అదనపు ఆదాయం సమకూరేలా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐలయ్య తెలిపారు. ఆ ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా కురుమ సంఘం భవనాల నిర్మాణానికి వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాల్లో కూడా కురుమ భవనాలు నిర్మించి విద్యార్థులకు, కుల బంధువులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కురుమ సమాజం రాజకీయంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, భవిష్యత్తులో కురుమల నుంచి కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఎన్నిక కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కురుమ సమాజ అభివృద్ధి కోసం ఎగ్గే మల్లేశంతో పాటు పలువున్ నేతలు నిస్వార్థంగా అహర్నిశలు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, సంఘం కార్యకలాపాలపై ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంఘం నాయకులను సంప్రదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని, ఎలాంటి అపకతవకలకు పాల్పడలేదని ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య బండారి సాక్షిగా స్పష్టం చేశారు.

= నిరాధార ఆరోపణలు చేసే తాటతీస్తాం

కురుమ సంఘంపై నిరాదార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తాటతీస్తామని ఈ సందర్భంగా కురుమ సంఘం అగ్రనేత క్యామ మల్లేశం తో పాటు పలువురు నాయకులు హెచ్చరించారు. ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే తమ వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కురుమ జాతిలో గొర్రెలు మేపే వ్యక్తి, ఉన్నత పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అందరూ సమానమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురుమలు అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉందని, నీతి నిజాయితీకి మారుపేరని అన్నారు. కురుమ జాతి అంతా ఐకమత్యంగా ఉండి ఎంతో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్న కల్సికట్టుగా ఉంటుందని, కురుమజాతి అభ్యున్నతి కోసమే కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్, నాయకులు శ్యామ్, నరసింహ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story