- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాథ ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు ఉప్పల వెంకటేష్ సేవలు అమోఘం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తూ, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన నిరుపేద బాలికల ఉన్నత విద్య కోసం విశేష కృషి చేస్తున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు.

దిశ, తలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తూ, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన నిరుపేద బాలికల ఉన్నత విద్య కోసం విశేష కృషి చేస్తున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రారంభించిన ఈ విద్యాసంస్థలో సుమారు 500 మంది నిరుపేద బాలికలకు ఉచితంగా విద్య, వసతి, భోజనం సహా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందు రజిని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలికల విద్య కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడమే కాకుండా, విద్యార్థినులకు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ సదుపాయాలు కల్పించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అరుదైన విషయమని, ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దేవుడిచ్చిన వరమని అభివర్ణించారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, ఉప్పల వెంకటేష్ తన జీవితకాలానికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ ఈ విద్యాసంస్థ నిరంతరంగా కొనసాగేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, నిర్వహణ బాధ్యతలను నారాయణ విద్యాసంస్థలకు అప్పగించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఈ పాఠశాలలో 300కుపైగా అడ్మిషన్లు పూర్తయ్యాయని, త్వరలోనే 500 సీట్లు పూర్తయ్యే అవకాశముందని నేతలు తెలిపారు. అనంతరం ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ, “నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, తలకొండపల్లి నాకు మరో జన్మనిచ్చింది. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతోనే ఈ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశాను. నేను ఉన్నా లేకపోయినా ఈ విద్యాసంస్థ ద్వారా పేద బాలికల విద్యాభ్యాసం ఆగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నాను” అని తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులను పలువురు నేతలు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






