- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేమింతే.. మా తీరింతే!
ఫామ్‌హౌస్‌కు ఒకప్పుడు రిఫ్రెష్‌మెంట్ కోసం వెళ్లేవాళ్లు. కానీ.. ఇప్పుడు నిర్వాహకులు వాటి అర్థమే మార్చేశారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఫామ్‌హౌస్‌కు ఒకప్పుడు రిఫ్రెష్‌మెంట్ కోసం వెళ్లేవాళ్లు. కానీ.. ఇప్పుడు నిర్వాహకులు వాటి అర్థమే మార్చేశారు. ఆటా, పాటా.. హంగామాల మాటున అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా చేసేశారు. విదేశీ మద్యాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు పొరుగు రాష్ట్రాల యువతులతో ముజ్రా, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ చుట్టూ 30-40 కి.మీ.ల పరిధిలోనే సుమారు ఐదు వందలకుపైగా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. పేకాట, వ్యభిచారం వంటి ఉదంతాలు సైతం పోలీసులు జరుపుతున్న దాడుల్లో వెలుగు చూస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు లైసెన్స్‌డ్ వ్యభిచార గృహాలుగా మారాయి.
వీకెండ్స్‌లో కిటకిటలాడుతున్న ఫామ్‌హౌస్‌లు
పలువురు తమ ఫామ్‌హౌస్‌లను అద్దెకు ఇస్తున్నారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్, కాటేజీలు, బంకెట్ హాళ్లు కట్టించి రోజుకు వేలల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నారు. బర్త్ డే పార్టీల పేరుతో మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు మద్యం, డ్రగ్స్ సమకూరుస్తుండడంతో చాలామంది ఇక్కడికి వచ్చి మజా చేస్తున్నారు.
యువతులతో అశ్లీల నృత్యాలు
ముజ్రా డ్యాన్స్ అనేది మొఘలుల కాలం నాటి తవాయిఫ్‌లు చేసే నృత్యం. దీన్ని నేడు అశ్లీలంగా మార్చేశారు. అలాగే 60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం రేవ్ పార్టీలు నిర్వహించేవారు. 80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం పూర్తిగా మారిపోయి సెక్స్, కాక్‌టెయిల్స్ వంటివి రేవ్ పార్టీలో ఓ భాగమైపోయాయి. ప్రస్తుతం రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడంతోపాటు వ్యభిచారం నిర్వహిస్తుండగా.. ఒక్కో కాల్‌గర్ల్‌కు రూ.10 నుంచి 25వేల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొంతమంది ఈవెంట్స్ నిర్వాహకులు యువతులను వారం, నెలవారీగా.. వేలు, లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వీకెండ్స్‌లో ఫాం హౌస్‌లు సందడి సందడిగా ఉంటుండగా.. కొంతమంది ఫామ్‌హౌస్‌ల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను కాపలా ఉంచుతున్నారు.
పట్టుబడుతున్నా ఆగని దందా
అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు కొన్ని ఫామ్ హౌస్‌లు అడ్డాగా మారాయి. పోలీసులకు అందిన సమాచారంతో అడపాదడపగా దాడులు నిర్వహిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఈ దందాకు అడ్డుకట్టపడటం లేదు. గత ఏడాదిలో జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనలో విదేశీ మద్యం పట్టుబడగా.. ఫామ్‌హౌస్ యజమాని అయిన కేటీఆర్ బావమరిదితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పరిధిలోని తోలుకట్టలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో గోదావరి జిల్లాకు చెందిన శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో కోడి పందేలు, క్యాసినో నిర్వహించగా.. పోలీసులు దాడులు చేసి పందెం కోళ్లతోపాటు, పెద్ద ఎత్తున నగదును, కార్లను, స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పోలీసులు ఫామ్‌హౌస్ యజమాని అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చారు. గత ఏడాది జూలైలో మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో 12 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ముజ్రా పార్టీ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి అర్ధ నగ్న డ్యాన్సులు చేయించడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏప్రిల్ నెలలో మొయినాబాద్‌లోని తలాబ్‌కట్ట ప్రాంతంలో ఉన్న హాలిడే ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరిట కొందరు ముజ్రా పార్టీని నిర్వహించగా పోలీసులు భగ్నం చేశారు. ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి ముంబై నుంచి వచ్చిన ఏడుగురు యువతులను గుర్తించారు. అక్కడే ఉన్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మద్యంతోపాటు గంజాయినీ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. తాజాగా నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి ఒకరు రెండు రోజుల క్రితం మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో స్నేహితులకు బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ వేడుకల్లో డ్రగ్స్‌తోపాటు, అక్రమ మద్యం ఉపయోగించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇలా అడపాదడపగా.. ఎక్కడో ఒక చోట ఫామ్‌హౌస్‌లలో అక్రమ వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది పాత నేరస్తులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నగర శివారులోని ఫామ్ హౌస్‌లను అడ్డాలుగా చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.






