- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమాలకు అడ్డా!
రాజేంద్రనగర్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

దిశ, గండిపేట : రాజేంద్రనగర్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొందరు బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖ అధికారుల మాటలు, చర్యలు పరస్పర విరుద్ధంగా ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. సర్కిల్ పరిధిలోని కాళీ మందిర్–పెబల్ సిటీ మార్గంలో ఓ బిల్డర్ స్టిల్ట్‌తో పాటు ప్లస్ 5 అంతస్తులకు మాత్రమే అనుమతి పొందినప్పటికీ, నిబంధనలను అతిక్రమిస్తూ అదనపు అంతస్తులు నిర్మిస్తునట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణం చేపట్టాడు. ఈ నిర్మాణం వ్యవహారంలో ఓ మాజీ కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు, బిల్డర్ కు మధ్య మధ్యవర్తిగా ఉండి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చి అంతా చక్కదిద్దినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రధాన రహదారిపైనే కొన్ని నిర్మాణాలు ఏమాత్రం అనుమతులు లేకుండా కొన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా నిర్మాణాలు..
పర్మిషన్లలో ఒక విధంగా చూపించి, వాస్తవానికి వచ్చేసరికి కొందరు బిల్డర్లు మరో విధంగా భారీ నిర్మాణాలు చేపడుతున్నా నియంత్రణ చర్యలు లేకపోవడం, తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరణ కోరిన ప్రజలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా చేతులెత్తేస్తుండటంతో, అక్రమ నిర్మాణాల వెనుక అంతా కుమ్మక్కు వ్యవహారం నడుస్తుందని అనుమానాలు బలపడుతున్నాయి.
దర్గా ఖలీజ్ ఖాన్ మార్గంలో..
కాళీ మందిర్ ఆలయం నుంచి దర్గా ఖలీజ్ ఖాన్ వెళ్లే మార్గంలో కంటి ఆసుపత్రి ఎదురుగా ఓ భారీ అక్రమ నిర్మాణం కొనసాగుతోంది. దీనికి నోటీసు ఇచ్చిన అధికారులు చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణాల విషయంలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీ మొత్తంలో ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పెరుగుతున్న ఈ తరహా ఉల్లంఘనలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నాకు సంబంధం లేదు..
- శ్రీధర్ ఏసీపీ, రాజేంద్రనగర్ సర్కిల్
పెబల్ సిటీ మార్గంలో నిర్మిస్తున్న భవనం జిహెచ్ఎంసిలో విలీనం కాక ముందటి నుంచి నడుస్తుంది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చార్జి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపడుతున్న భవనాలకు నేను బాధ్యుడిని. అంతకుముందు అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారి పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలి.
లీడర్ ను అడగండి..
సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయమై ఆయనను వివరణ కోరగా..పెబల్ సిటీ వెళ్లే మార్గంలో బిల్డింగ్ సంబంధించి కొన్ని రోజుల క్రితం ఓ మాజీ ప్రజా ప్రతినిధి దానికి పర్మిషన్ ఇప్పించారు. అక్రమ నిర్మాణం విషయం కూడా ఆయనకే సంబంధం అంటూ..తనకు ఏమాత్రం తెలియదని చేతులు దులిపేసుకోవడం గమనార్హం. జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






