- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వర్గసీమ’ వెంచర్ యాజమాన్యం పెద్ద డ్రామా.. గిఫ్ట్ డీడ్ చేసినా రూ. 5 కోట్ల పంచాయతీ భూమి కబ్జా!
‘సుకేతన వెంచర్’ నిర్వాహకులు గిఫ్ట్ డీడ్ చేసిన రూ. 5 కోట్ల పంచాయతీ భూమిని అప్పగించకుండా ప్రైవేట్ వ్యక్తులతో బెదిరింపులకు దిగుతున్నారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చెరుకుపల్లి గ్రామ పంచాయతీలో ‘స్వర్గసీమ శాండిల్ వుడ్ ఫార్మ్స్’ ఏర్పాటు చేసిన ‘సుకేతన వెంచర్’కు అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. పంచాయతీకి పది శాతం ల్యాండ్ ను గిఫ్ట్ డీడ్ చేసినప్పటికీ.. ఆ స్థలాన్ని యాజమాన్యం జీపీకి అప్పగించలేదని పాలకవర్గం ఆరోపిస్తున్నది. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు సైతం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయడమే కాకుండా.. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టి.. జీపీ ల్యాండ్ ను పరిశీలించేందుకు వెళ్లిన వారిని బెదిరిస్తున్నారని సర్పంచ్ తో పాటు పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
జీపీకు కేటాయించిన ల్యాండ్ ఎక్కడ?
చెరుకుపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 238/పీ, 239/పీ, 242/పీ, 243/పీ, 244/పీ, 245/పీ, 246/పీ, 249/పీ, 250/పీ, 263/పీ లలోని సుమారు 40.22 ఎకరాల విస్తీర్ణంలో ‘స్వర్గ సీమ సాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేటు లిమిటెడ్’ ఆధ్వర్యంలో సుకేతన వెంచర్ పేరిట భారీ లే అవుట్ వేశారు. నిబంధనల ప్రకారం యాజమాన్యం 10 శాతం ల్యాండ్ కింద పంచాయతీకి 4 ఎకరాల 55 సెంట్లు (19,626 చదరపు గజాలు) భూమిని గిఫ్ట్ డీడ్ చేసినట్లు పాలకవర్గం చెబుతున్నది. అయితే ఆ స్థలం ఎక్కడ ఉన్నది అనేదానిపై స్పష్టత లేదని, ఫెన్సింగ్ గానీ, బోర్డులు గానీ ఏర్పాటు చేయలేదని అంటున్నది.
గిఫ్ట్ డీడ్ చేసేనాటికే సదరు స్థలం విలువ రూ.5 కోట్లకు పైనే ఉన్నట్లు పాలకవర్గ సభ్యులు అంటున్నారు. స్థలాన్ని పరిశీలిద్దామని వెళ్తే కాపలాగా ఉంచిన ప్రైవేటు వ్యక్తులతో బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సర్పంచ్ యాదయ్య తో పాటు పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవో శ్రీరామ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జీపీ ల్యాండ్‌ను పంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రహరీని తొలగించడంతోపాటు పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసిన రహదారులను గ్రామస్తులు వాడుకునేలా అనుమతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అక్రమ కట్టడాలపై నోటీసులు
సుకేతన వెంచర్ లో చేపట్టిన అక్రమ కట్టడాలపై పంచాయతీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ మాదిరిగా చుట్టూ భారీ ప్రహరీ, వెంచర్ మధ్యలో క్లబ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. చెరుకుపల్లి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేశారు. దీంతో పీఆర్ యాక్ట్ 114(1) (8), సెక్షన్ 113 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని రెండు సార్లు పంచాయతీ కార్యదర్శి వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలిసింది. తాజాగా పాలకవర్గం ఇచ్చిన ఫిర్యాదుపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.
స్థలం అప్పగించేలా చర్యలు తీసుకుంటాం
జీపీకి కేటాయించిన ల్యాండ్ చుట్టూ వెంచర్ నిర్వాహకులే ప్రీ కాస్ట్ వాల్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో చెరుకుపల్లి పంచాయతీ పాలకవర్గం నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై వెంచర్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చాం. త్వరలో వెంచర్ ను సందర్శించి సదరు స్థలాన్ని పంచాయతీకి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం. :-విజయ్ కుమార్, ఎంపీవో
మూడు చోట్ల చూపించారు
వెంచర్ నిర్వాహకులు గిఫ్ట్ డీడ్ చేసిన ల్యాండ్ ను మూడు చోట్ల చూపించారు. నాకంటే ముందు ఇక్కడ పని చేసిన పంచాయతీ కార్యదర్శి చెబితేనే నాకు ఆ విషయం తెలిసింది. గ్రామ పంచాయతీ స్థలం అని చెప్పేలా అక్కడ ఎటువంటి బోర్డులు లేవు. దీనిపై ప్రస్తుత పాలకవర్గం ఫిర్యాదు చేసిన విషయం నాకు తెలియదు.:-అశోక్, పంచాయతీ కార్యదర్శి






