- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్వా‘ఢీ’ల వివాదం ముగిసినట్లేనా!
రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం ఎట్టకేలకు సద్దుమణిగింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో ఉవ్వెత్తున ఎగిసిన 'మార్వాడీ గో బ్యాక్' ఉద్యమం ఎట్టకేలకు సద్దుమణిగింది. 'మార్వాడీ గో బ్యాక్' నినాదం రాష్ట్ర స్థాయిలో ట్రెండింగ్‌లో ఉన్న సందర్భంలోనే ఆమన్‌గల్ వివాదం చోటుచేసుకోవడంతో.. ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అది కాస్తా.. రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలైందంటూ సోషల్ మీడియాలోనూ ఆమన్‌గల్ వివాదం వైరల్ అయింది. పోలీసులు చొరవ చూపి ఈ వివాదానికి తెరదించారు.
15 ఏళ్ల క్రితమే వలసలు
రాజస్థాన్‌లో కరువు వచ్చినప్పుడు నిజాంల కాలంలో మార్వాడీలు హైదరాబాద్‌కు వలస వచ్చారని అంటారు. ఇదే క్రమంలో పదిహేనేండ్ల క్రితమే కొంత మంది రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. ఇందులో కొన్ని కుటుంబాలు ఆమన్‌గల్, కడ్తాల్, కల్వకుర్తి తదితర చోట్ల వ్యాపారాలను నిర్వర్తిస్తున్నాయి. ఒక్క ఆమన్‌గల్ పట్టణ కేంద్రంలోనే 15కు పైగా కుటుంబాలు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. మొదట్లో చిన్న కిరాణం, స్వీట్ షాపులతో ప్రారంభించి ప్రస్తుతం బంగారం, ఎలక్ట్రానిక్, నిర్మాణ రంగం, హోటళ్లు, చెప్పుల వ్యాపారం తదితర రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించారు. వీరి వ్యాపార విస్తరణతో తమ వ్యాపారం తగ్గిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నా రు. మార్వాడీలు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడంతో స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి అన్నది స్థానికుల మరో వాదన. ఈ నేపథ్యంలోనే లోకల్ వ్యాపారులు మార్వాడీ వ్యాపారస్తులపై తిరుగుబాటుకు దిగుతున్నారు.
ఒప్పందం ఉల్లంఘనతో..
అన్నిచోట్ల మాదిరిగానే లోకల్, నాన్ లోకల్ ఫైట్ ఆమన్‌గల్‌లో ఎంతో కాలంగా నడుస్తోంది. స్థానిక కుల సంఘాల తీర్మానాలతో కొత్తగా దుకాణాలను ఏర్పా టు చేసుకోవడం అన్నది అన్ని సామాజిక వర్గాల్లోనూ కొనసాగుతూ వస్తోంది. అయితే మార్వాడీలు మాత్రం ఏకపక్షంగా దుకాణాలను విస్తరించుకుంటూ పోతుండడమే స్థానిక వ్యాపారుల కోపానికి ఒకింత కారణమైంది. మూడేళ్ల క్రితం స్థానిక వ్యాపారులకు, మార్వాడీలకు మధ్య ఒప్పందం జరిగింది. అప్పటివరకు ఉన్న మార్వాడీలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, కొత్తగా వ్యాపారాన్ని విస్తరించవద్దన్నది ఆ ఒప్పందం సారాంశం. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటీవల కొత్తగా షాప్‌ను ఓపెన్ చేసేందుకు మార్వాడీలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారులకు కోపాన్ని తెప్పించింది. ఈ క్రమంలోనే మార్వాడీ గో బ్యాక్ నినాదానికి పిలుపునిచ్చి ఈనెల 18న ఆమన్‌గల్ బంద్‌కు స్థానిక కిరాణ, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘాలు పిలుపునిచ్చాయి.
భూతద్దంలో చూపించే యత్నం
హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదం కారణంగా గో బ్యాక్ మార్వాడీ నినాదం మొదలైంది. సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారడం.. దీనిపై సామాజిక ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు స్పందించడంతో ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆమన్‌గల్‌లో జరిగిన పరిణామాలతో బంద్‌కు పిలుపునివ్వడంతో లోకల్ ఫైట్ కాస్తా.. రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మారిపోయింది. కొందరు ఈ వ్యవహారాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆమన్‌గల్ ఉదంతంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసి.. సమస్యకు గల మూలాలను కనుగొన్నారు. పోలీసుల సూచనతో జరిగిన చర్చలో స్థానిక వ్యాపారులకు, మార్వాడీలకు మధ్య సయోధ్య కుదిరింది. దీంతో బంద్ నిర్ణయాన్ని లోకల్ వ్యాపారులు వాయిదా వేసుకోవడంతో వివాదం సుఖాంతమైంది. ఆమన్‌గల్ ఘటనతో బలపడుతుందనుకున్న మార్వాడి ఉద్యమానికి ప్రస్తుతానికైతే బ్రేక్ పడింది.






