- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టర్ ఫ్లై సిటీకి షోకాజ్.. జీపీకి ఇచ్చిన ల్యాండ్‌లో మట్టి తవ్వకాలు
సీలింగ్ ల్యాండ్ లో రెడీ మిక్స్ ప్లాంట్ నడుపుతూ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ‘బట్టర్ ఫ్లె’ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: సీలింగ్ ల్యాండ్ లో రెడీ మిక్స్ ప్లాంట్ నడుపుతూ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ‘బట్టర్ ఫ్లె’ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పంచాయతీలోని ఓ వెంచర్ లో నిబంధనలను ఉల్లంఘించారని జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు.
జీపీకి ఇచ్చిన స్థలంలోనే..
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 881, 878లో ఐదు ఎకరాల్లో ‘బట్టర్ ఫ్లై సిటీ-ప్రొఫెషనల్ ప్యారడైజ్’ పేరుతో భారీ వెంచర్ ను ఏర్పాటు చేశారు. పది శాతం ల్యాండ్ కింద 2,420 చదరపు గజాల స్థలాన్ని గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే యాజమాన్యం కక్కుర్తి పడింది. ఇతర వెంచర్ల అభివృద్ది కోసం జీపీకు ఇచ్చిన స్థలంలో మట్టి తవ్వకాలు జరిపింది. దీనిపై స్థానికులు ఈ ఏడాది మార్చి 24న అధికారులకు ఫిర్యాదు చేయగా.. కందుకూరు డీఎల్పీఓ సాంబిరెడ్డి క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ చేశారు. బట్టర్ ఫ్లై సిటీ యాజమాన్యం వెంచర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని నిబంధనల మేరకు అభివృద్ధి చేయలేదని గుర్తించారు. లే అవుట్ అనుమతి సందర్భంగా విధించిన షరతులకు కట్టుబడలేదని తేల్చారు. అలాగే పార్కు కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మట్టి తవ్వడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాద కరంగా ఉన్నట్లు సైతం విచారణ సందర్భంగా గుర్తించారు. ఈ మేరకు డీఎల్పీఓ మే నాలుగో తేదీన విచారణ నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించారు.
వెంచర్ అనుమతులు రద్దు?
వెంచర్ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు మట్టి దోపిడీ చేయడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వి.సురేష్ మోహన్ ఈ నెల 19వ తేదీన ‘బట్టర్ ఫ్లె’ యాజమాన్యానికి షోకాజ్ నోటీసును జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోతే మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విడుదల చేయకుండా నిలిపివేస్తామని, లే అవుట్ అనుమతి సైతం రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన నోటీసుకు ‘బట్టర్ ఫ్లై’ యాజమాన్యం ఏం సమాధానం ఇస్తుంది? అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు!
‘ఫార్చ్యూన్ బట్టర్ ఫ్లై ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్’ కడ్తాల్ పరిసర ప్రాంతాల్లో సుమారు 3,600 ఎకరాలకు పైగా ఎకరాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్నది. అయితే వెంచర్ల ఏర్పాటు సందర్భంగా యాజమాన్యం అనేక అక్రమాలకు పాల్పడుతుండగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వెంచర్లలో సీసీ రోడ్డు వేసేందుకు అవసరమైన రెడీ మిక్స్ ప్లాంట్ ను సీలింగ్ ల్యాండ్ లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించగా.. ఇటీవల గ్రామ పంచాయతీ అధికారులు విచారణ జరిపి నిర్ధారించారు. ఇక కడ్తాల్ లోని ఓ వెంచర్ లో జీపికి కేటాయించిన ల్యాండ్ లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. దీనిపై తాజాగా జిల్లా పంచాయతీ అధికారి నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఇదొక్కటే కాదు..‘బట్టర్ ఫ్లె’ సిటీపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. కుంటలు, చెరువుల ఆక్రమణలతోపాటు అనేక వెంచర్లలో చేస్తున్న చీకటి దందాలు బయట పడే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లా అధికారులు ఈ దిశగా దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు.






