పెట్టుబడులకు అనుకూలం.. నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న హయత్‌నగర్ ఏరియా

by Javid Pasha |   (  Updated:2025-11-15 08:07:53  IST  )

హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లోప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

పెట్టుబడులకు అనుకూలం.. నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న హయత్‌నగర్ ఏరియా
X

దిశ, తెలంగాణ బ్యూరో : అందరూ ముంబయి, బెంగుళూరు హైవేలపై దృష్టి పెడుతున్నారు. కానీ ఓ వైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు విజయవాడ జాతీయ రహదారి.. పక్కనే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రతిపాదిత త్రిబుల్ ఆర్ వచ్చేస్తున్నది. ఓ ఏరియా డెవలప్‌మెంట్ కావాలంటే ఇంతకంటే మెరుగైన రవాణా సదుపాయం ఏముంటుంది? రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్‌రైల్ ప్రాజెక్టులతో హయత్‌నగర్ దశ మారనున్నది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు లైన్‌ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఏ ప్రాంతంతో పోల్చినా హయత్ నగర్‌వైపు రియల్ ఎస్టేట్ అంతగా అభివృద్ది చెందలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు హయత్‌నగర్ వైపు నిర్మాణ రంగం క్రమంగా స్పీడందుకుంటున్నది.

ఇప్పటి వరకు ఇండిపెండెంట్ ఇండ్లకే పరిమితమైన హయత్‌నగర్‌లో ప్రస్తుతం అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణం జోరందుకుంది. హయత్ నగర్ దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ రద్దీని చూస్తేనే పెరిగిన జనసాంద్రత స్పష్టమవుతున్నది. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. అందుకే ఈ ప్రాంతమంతా విస్తరిస్తున్నది. ప్లాట్లు గజం రూ.లక్ష పెట్టి కొనుగోలు చేయడం ద్వారా పెరుగుదల తక్కువ. ఏ దిక్కున చూసినా ధరలు అమాంతంగా పెరిగాయి. ఇప్పుడు ఇటువైపు మాత్రమే కాస్త సౌకర్యవంతంగా ఉన్నాయి. పెట్టుబడి పెట్టి రానున్న రోజుల్లో అమ్మేసుకుంటే పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు సూచిస్తున్నాయి.

30 ఏండ్ల క్రితం ఇలా..

నగర శివారు ప్రాంతంగా ఉండే హయత్‌నగర్ ఇప్పుడు నగరంలో భాగమైంది. 30 ఏండ్ల క్రితమే ఇటు వైపు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటైంది. అయినా పెద్ద చెట్టు కింద చిన్న చెట్లు పెరుగవన్నట్టుగా ఈ ప్రాంతం ఆశించినంతగా అభివృద్ది చెందలేదు. ఆ తర్వాత సంఘీ టెంపుల్, మౌంట్ ఒపెరా వంటివి ఏర్పాటయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీలు ఏర్పాటయ్యాయి. అయినా చెప్పుకోదగ్గ, మిగతా ప్రాంతాలతో పోల్చే స్థాయిలో అభివృద్ది జరగలేదు. హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హయత్ నగర్ వైపు రియల్ ఎస్టేట్ వెనకబడింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

ఊహించని రీతిలో ఇండ్ల నిర్మాణాలు

విజయవాడ జాతీయ రహదారి, పక్కనే ఔటర్ రింగ్ రోడ్డుతో మెరుగైన రవాణా సౌకర్యంతో క్రమంగా అభివృద్ధి చెందుతున్నది. ఎవరూ ఊహించని రీతిలో ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. తాజాగా అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులు జోరుగా సాగుతున్నాయి. సినీ హీరో రవితేజ వనస్థలిపురంలో కాంప్లెక్స్ నిర్మించారంటే ఫ్యూచర్‌ని అంచనా వేసినట్టే. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హయత్ నగర్, ఆపై ఏరియాలో పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని అంచనా. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. ఆపైన ధరలు పెరగడమంటే కష్టం. అందుకే తక్కువ ధరలో దొరికే ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేయడం వల్లే భరోసా లభిస్తుంది. ఆశించిన దాని కంటే అధికంగా చేజిక్కుతుందంటున్నారు.

పెరుగుతున్న కొనుగోళ్లు

విజయవాడ హైవేలో వనస్థలిపురం వరకు ప్లాట్లు కొనడం సామాన్యులకు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆపై ఉండే హయత్ నగర్, పరిసర ప్రాంతాల్లో పదేళ్లలో ప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిన్న చిన్న కాలనీలు, వెంచర్లు ఏర్పాటయ్యాయి. హయత్ నగర్ తర్వాత పెద్ద అంబర్ పేట కూడా డెవలప్ అవుతున్నది. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. అయితే ఇప్పటికీ చాలా మంది నివాసాల కోసం కాకుండా.. పెట్టుబడి కోణంలోనే ఇంటి స్థలాలు కొంటున్నారు. అక్కడ నివాసయోగ్యమైన కాలనీల నిర్మాణంపై.. గేటెడ్ కమ్యూనిటీలపై రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడిప్పుడే దృష్టి సారించాయి. ప్రస్తుతం హయత్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాలైన కుంట్లూరు, కోహెడ, తట్టి అన్నారం, పెద్ద అంబర్ పేట ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు స్టాండ్‌లోన్ అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణం పెరిగింది. చిన్న చిన్న బిల్డర్లు నుంచి మొదలు పెద్ద నిర్మాణ సంస్థలు హయత్ నగర్ ప్రాంతంలో నివాస ప్రాజెక్టులను చేపడుతున్నాయి. హయత్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉంది. చిన్న చిన్న బిల్డర్లు 100 గజాల నుంచి మొదలు 300 చదరపు అడుగు విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తున్నారు.

విస్తీర్ణాన్ని బట్టి ధరల్లో మార్పు

ఒక్క ఇల్లు 45 లక్షల నుంచి విస్తీర్ణాన్ని బట్టి కోటి రూపాయల వరకు ధరలున్నాయి. ఇక అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 3,400 నుంచి 4,200 రూపాయల వరకు ధరలున్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల నుంచి 52 లక్షల మధ్య లభిస్తుండగా.. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ 55 లక్షల నుంచి 65 లక్షల మధ్య లభిస్తున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో కొన్ని నిర్మాణ సంస్థలు విల్లాల నిర్మాణం చేపట్టాయి. ఒక్క విల్లా విస్తీర్ణాన్ని బట్టి రూ. 1.20 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. ఔట్ రింగ్ రోడ్డుకు సమీపంలో అయితే ఇడిపెండెంట్ ఇళ్లు 1.2 కోట్లు, విల్లాలు 2.5 కోట్ల రూపాయలుగా ధరలు పలుకుతున్నాయని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హయత్ నగర్ తో పోటు సమీప ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 35 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ధరలున్నాయి. పెద్ద అంబర్ పేట్ లో చదరపు గజం 32 వేల రూపాయల నుంచి 54 వేల రూపాయల వరకు ధరలున్నాయి. ఇక పసుమాముల, తట్టి అన్నారం వంటి ప్రాంతాల్లో చదరపు గజం 42 వేల నుంచి 60 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

Next Story