ప్రతి ఓటరికి జాబితాలో స్థానం కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం

by Kodari Anjali |

ఎస్ ఐ ఆర్ పై ర్యాలీ అనంతరం ప్రజలకు ఆర్డీవో వై శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు.

ప్రతి ఓటరికి జాబితాలో స్థానం కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం
X

దిశ, ఇబ్రహీంపట్నం: ప్రతి ఓటరుకి జాబితాలో స్థానం కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ వై. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు (ఎస్ఐఆర్) పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డిఓ వై. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 2K రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడంతో పాటు, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వారి పేర్లను తొలగించనున్నట్లు తెలిపారు.

39 మంది సూపర్వైజర్లు సహా..

ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, ఏవైనా మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30వ తేదీ వరకు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 359 మంది బీఎల్‌ఓలు, 39 మంది సూపర్వైజర్లు సహా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. ప్రజలు పూర్తి సహకారం అందించి ఓటరు జాబితాను తప్పులులేని విధంగా రూపొందించేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎస్ హెచ్ ఓ మద్ది మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల తహసీల్దార్ లు సునీత రెడ్డి, ప్రసాద్ రావు, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమీషనర్ వై సుదర్శన్, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story