ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

by Kodari Anjali |

ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డితో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) వివరాలను పరిశీలించి అర్హులైన ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. హేతుబద్ధీకరించిన ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31న ప్రచురించనున్నట్లు తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు వాటిని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై..

అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అలాగే పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని, ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మరణించిన వ్యక్తుల పేర్లు తుది జాబితాలో ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన బీఎల్‌వోలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డిక్లరేషన్ ఫారం ద్వారా..

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిరునామా మార్పులు, వివరాల సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ఇంటింటి గణన సందర్భంగా ఫారం-6 మరియు డిక్లరేషన్ ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్లు వివరాల పరిశీలన, ఫారాల పూరణకు టోల్ ఫ్రీ నంబర్ 1950, ఓటర్ పోర్టల్, ఈసీఐనెట్ (ఈసీఐనెట్) యాప్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సరిత, జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story