మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

by Taduka Kalyani |

మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ బ్రిడ్జి సమీపంలో నకిలీ పత్తి విత్తనాల రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
X

దిశ, మందమర్రి : మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ బ్రిడ్జి సమీపంలో నకిలీ పత్తి విత్తనాల రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు (TS19 H 5554)ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి బిల్లులు, అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. దీంతో శ్రీపతి నగర్‌కు చెందిన మహమ్మద్ సాహెబ్ జానీ (54), మహమ్మద్ అఫ్రోజ్ (29)లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో, సులభంగా అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో బైంసాకు చెందిన ఓ వ్యక్తి వద్ద కిలో రూ.1,000 చొప్పున ఈ నకిలీ విత్తనాలను కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. వాటిని మందమర్రి పరిసర గ్రామాల రైతులకు బ్రాండెడ్ కంపెనీల నకిలీ సంచుల్లో ప్యాక్ చేసి కిలో రూ.2,500 చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాల వ్యాపారంతో అమాయక రైతులను మోసం చేసే ప్రయత్నాలను అరికట్టేందుకు పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మందమర్రి ఎస్సై జి. నరేష్, కానిస్టేబుళ్లు రాకేష్, చైతన్యలను సీఐ పర్సా రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

Next Story