- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు మరో గర్వకారణం.. న్యాక్‌కు ప్రతిష్టాత్మక ప్లాటినం అవార్డు
నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కేటగిరీలో న్యాక్.. ప్రతిష్టాత్మక ప్లాటినం అవార్డును కైవసం చేసుకుంది. దీంతో పాటు ప్రభుత్వ సేవలో ఆర్ అండ్ బీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను నాక్ డైరెక్టర్ జనరల్ అయిన ఆర్ అండ్ బీ క్వాలిటీ కంట్రోల్ సీఈ ఎం. శ్రీనివాస రెడ్డికి ఐఎస్డీఏ ఇన్‌ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్ (ఐఐఎన్ఏ-2026)లో గోల్డ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ (ఐఎస్డీఏ) ప్రముఖ సంస్థగా సేవలందిస్తోంది. సామర్థ్య నిర్మాణం, ఆవిష్కరణలు, సుస్థిరతపై దృష్టి సారిస్తూ.. పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, యువ నిపుణులు కలిసి పనిచేయడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య ధృవీకరణలు, పరిశోధనలు, సీఎస్‌ఆర్ అమలు, సదస్సులు, ప్రదర్శనల ద్వారా పరిశ్రమ రూపకల్పనలో ఐఎస్డీఏ కీలక పాత్ర పోషిస్తోంది.
21 వేల మందికి పైగా ఉచిత శిక్షణ..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో న్యాక్ ప్రధాన వృత్తి శిక్షణ సంస్థగా అద్భుత విజయాలు సాధిస్తోంది. వివిధ నిర్మాణ రంగ ట్రేడ్స్‌తో పాటు, సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం నాక్ నాణ్యమైన శిక్షణను అందిస్తోంది. ఇందులో భాగంగానే, 2025–26 ఆర్థిక సంవత్సరంలో న్యాక్ మొత్తం 21,016 మందికి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. నిరుద్యోగ యువతకు పూర్తి ఉచిత శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పించి, వారికి ఉత్తమ ఉద్యోగ అవకాశాలు లభించేలా చేయూత అందించింది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డులు సాధించి తెలంగాణ కీర్తిని చాటిన న్యాక్ డీజీ ఎం. శ్రీనివాస రెడ్డిని, సంస్థ డైరెక్టర్లను, సిబ్బందిని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. న్యాక్ విజయవంతంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, యువతకు కల్పిస్తున్న ఉపాధి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.






