డాక్టర్ల సమ్మె విరమణ.. మంత్రి జోక్యంతో బదిలీల గందరగోళానికి చెక్

by Ramesh Naini |

వైద్య ఆరోగ్య శాఖలో గత కొద్ది రోజులుగా తీవ్ర గందరగోళానికి దారి తీసిన ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది.

డాక్టర్ల సమ్మె విరమణ.. మంత్రి జోక్యంతో బదిలీల గందరగోళానికి చెక్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలో గత కొద్ది రోజులుగా తీవ్ర గందరగోళానికి దారి తీసిన ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఓపీ సేవల బంద్.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జోక్యంతో తెరపడింది. మరోవైపు ఈ బదిలీల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాల్సిన జీవో నెంబర్ 38ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా తెచ్చుకున్న జీవో నెంబర్ 28 పేరిట పూర్తిగా భ్రష్టు పట్టించారని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల సర్వీసు దాటిన వారికి బదిలీల్లో అసలు ఆప్షన్లు ఇచ్చుకునేందుకే అవకాశం కల్పించలేదని, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన స్పౌజ్ (భార్యాభర్తల), మెడికల్ గ్రౌండ్స్ కేసులను కూడా అధికారులు పూర్తిగా ఖాతరు చేయడం లేదని వైద్యులు, సిబ్బంది వాపోయారు.

రంగంలోకి దిగిన మంత్రి..

బదిలీల అక్రమాలపై శుక్రవారం సాయంత్రం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) కార్యవర్గం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించింది. జీవో 38ని యథాతథంగా అమలు చేయనందుకే తాము ఓపీ సేవలను బంద్ చేయాల్సి వచ్చిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. జీవో 38 ప్రకారమే బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒక రోజు అదనపు పొడిగింపుతో బదిలీల వెబ్ ఆప్షన్ల గడువు శుక్రవారం సాయంత్రం తోనే ముగిసిపోయింది. అయితే అధికారుల తీరు వల్ల ఆప్షన్లు నమోదు చేసుకోలేకపోయిన స్పౌజ్ కేసులు, మెడికల్ గ్రౌండ్స్ అభ్యర్థులు, మూడేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి శనివారం ప్రత్యేకంగా ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నుంచి స్పష్టమైన హామీ రావడంతో ప్రభుత్వ వైద్యుల సంఘం తమ సమ్మెను (ఓపీ సేవల బంద్) ఉపసంహరించుకుంది. శనివారం నుంచి యథావిధిగా విధుల్లో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని ప్రకటించింది.

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆవేదన తీరేనా?

వైద్యులకు మంత్రి ఆదేశాలతో ఊరట లభించినప్పటికీ.. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు, ఫార్మసిస్ట్‌లు, నాన్-పారామెడికల్ సహా మిగతా విభాగాల సిబ్బంది పరిస్థితి ఇంకా అయోమయంలోనే ఉంది. జీవో 28లోని 2(c) సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని, కేవలం డాక్టర్లకు మాత్రమే పరిమితం కావాల్సిన నిబంధనలను తమకు కూడా గుడ్డిగా వర్తింపజేస్తూ వెబ్ ఆప్షన్లను బ్లాక్ చేశారని పలువురు వైద్య, ఆరోగ్య సిబ్బంది మండిపడుతున్నారు. హైదరాబాద్ మల్టీజోన్-2 పరిధిలో క్లియర్ గా 5 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని... దరఖాస్తు చేసుకునేందుకు జిల్లాల్లో ఉన్న అధికారులు కూడా ఐదుగురే ఉన్నా అధికారులు వెబ్ ఆప్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జిల్లాలలోనే మగ్గుతున్న తమలాంటి రూరల్ ఉద్యోగులకు బదిలీల్లో సమాన అవకాశం కల్పించకపోతే, తాము కూడా కోర్టును ఆశ్రయించి బదిలీలపై స్టే తెచ్చుకోవడానికి వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్లతో పాటు డీసీఏ, పారామెడికల్ సిబ్బందికి కూడా ఈ శనివారం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story