- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

- రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ జంటనగరాల జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీతా గోపాల్‌దాస్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పి.ఎస్.యు) నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల ప్రాతినిధ్య కార్మిక సంఘాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించే బాధ్యతను రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. నామినేషన్ల పరిశీలన, అర్హులైన ఓటర్ల జాబితా ప్రకటన. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సహా ఎన్నికల నియమావళి ప్రకారం వచ్చే వివాదాల పరిష్కారం మొత్తం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు కార్మిక శాఖ ఇప్పటికే టీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యంతో పాటు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ కేంద్రాలు, ఓటరు అర్హత ప్రమాణాలను రిటర్నింగ్ అధికారి త్వరలోనే విడిగా ప్రకటిస్తారు. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం జరిగే ఈ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగులు, వాటాదారులు సహకరించాలని కార్మిక శాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసినట్లు అయ్యింది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికైన తర్వాత ఆ సంఘం ప్రతినిధులకే విలీన కమిటీలో ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లుగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.






