- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవిష్యత్ అభివృద్ధికి స్పెషల్ ప్లాన్.. 8 జోన్లతో ఫ్యూచర్ సిటీ
ఇప్పటికే హైదరాబాద్ సిటీ మెడికల్ టూరిజానికి స్పెషల్ స్పాట్‌గా ఉంది. కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీలో కూడా 663 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అద్భుతాల నగరంగా ఉండనుంది. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా ప్యూచర్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే టీజీఐఐసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ ఆథారిటీ (ఎఫ్సీడీఏ) సంయుక్తంగా 8 జోన్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సుమారు 5వేల ఎకరాల్లో ఎనిమిది రకాల జోన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎడ్యుకేషన్ జోన్
భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ జోన్ కు భారీగానే భూమూలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ జోన్ లో నాలుగురకాలైన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని, ఒక్కో యూనివర్సిటికీ కనీసం 20 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పూర్డ్యూ యూనివర్సిటీ, రస్సెల్ గ్రూపు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ లాన్ కాస్టర్, ఎన్ఐయూఎం వంటి సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి భూమి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు యూనివర్సిటీలో డార్మెటరీ, కేఫ్టేరియా, మౌలిక వసతులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్ తోపాటు కోర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లో ఐఐటీ, ఐఎస్బీ, బిట్స్ ఫిలానీ వంటి సంస్థలు ఉండడంతో విదేశీ విద్యార్థులు రావడానికి అవకాశముందని ప్రముఖ విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్పోర్ట్స్ జోన్ కు వెయ్యి ఎకరాలు
వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీ మోడల్ లో దుబాయ్ స్పోర్ట్స్ సిటీతో కలిసి జీఎంఆర్ సంస్థ 1000 ఎకరాల్లో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. 50 ఎకరాల్లో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు.
హెల్త్ సిటీ - మెడికల్ టూరిజం
ఇప్పటికే హైదరాబాద్ నగరం మెడికల్ టూరిజానికి ప్రత్యేకత ఉంది. కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీలో కూడా 663 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యూనానీ, సిద్దా, హోమియోపతిలతో కూడి వెల్ నెస్ రిసార్ట్స్, నర్సింగ్ హస్టళ్లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఐదు అంతర్జాతీయ, రెండు భారత సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ఏఐ సిటీ..
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులకనుగుణంగా ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)కి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే 508 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని భవిష్యత్ లో మరో 25ఎకరాలకు పెంచనున్నారు.100 ఎకరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. టీ-వర్క్స్, టీ-హబ్ తరహాలో మరో 20 ఎకరాల్లో ఇన్నోవేషన్ క్యాంపస్, 20 ఎకరాల్లో గూగుల్, మైక్రోసాప్ట్ తరహాలో టెక్ మేజర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎకో టూరిజం..
ఎకో టూరిజం జోన్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అటవీశాఖకు చెందిన భూములను గుర్తించి యానిమల్ పార్క్, వాటర్ టవర్స్, ఎకో టూరిజం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ)తో సమన్వయం చేసుకుని ఎకోటూరిజం జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇప్పటికే ఉన్న జలవనరులు, జంతు ప్రదర్శన శాల, ఎకో టూరిజం జోన్‌లను సంరక్షిస్తారు. పర్యాటకం, వ్యాపార సందర్శనలను ప్రోత్సహించడంలో భాగంగా ఫ్యూచర్ సిటీ సరిహద్దు వెంట అనేక హోటళ్లు, రిసార్ట్‌లనూ ప్రణాళికలో పొందుపర్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఈ-వేస్ట్ డిస్పోజల్ మెకానిజమ్స్, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లతో ఫ్యూచర్ సిటీ సన్నద్ధమవుతుంది. ఇవి అన్ని రకాల వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహిస్తాయి.
ఎంటర్ టైన్ మెంట్ జోన్
విద్య, వైద్యం, క్రీడలు, ఐటీ, ఏఐ, మెడికల్ ఇలా ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనిషికి ఎంటర్ టైన్ మెంట్ కూడా ఎంతో అవసరం. ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే ఎంటర్ టైన్ మెంట్ ఎంతో అవసరం. దీని కోసం 500 ఎకరాలు కేటాయించారు. బాహుబలి థీమ్ పార్కు, ఫిల్మ్ సిటీ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రెసిడెన్షియల్ జోన్
సుమారు 1300 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్-టౌన్ షిప్ ప్లానింగ్ కోసం కేటాయించారు. హౌసింగ్ తోపాటు బహుళా ప్రయోజనాల కోసం భూమిని వినియోగించాలని నిర్ణయించారు. స్కూల్స్, హస్పిటల్స్, షాపింగ్ మాల్స్, రిటైల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. సకల సౌకర్యాలతో కూడిన టౌన్ షిప్ ఏర్పాటు చేయనున్నారు. నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను అధికారులు రూపొందించారు.
మానుఫక్చరింగ్ క్లస్టర్…
ఫ్యూచర్ సిటీలో మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైఫ్ సైన్సెస్, ఈవీ, ఎలక్ట్రానిక్ జోన్లను ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఫర్నీచర్ పార్క్ ను 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవేలతో సరిహద్దుగా ఉన్న కీలకమైన అభివృద్ధి కారిడార్‌ను ఫ్యూచర్ సిటీ కవర్ చేస్తుంది. ఇది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఒకేచోట విశాలమైన భూమి ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సంస్థలతో తెలంగాణ భవిష్య నగర ఆర్థిక శక్తికి ఈ ప్రాంతం కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ మహానగరంపై ఒత్తిడిని తగ్గించడం, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన జీవనం, వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ప్రణాళికాబద్ధంగా ప్రత్యామ్నాయాన్ని అందించడమే ఫ్యూచర్ సిటీ లక్ష్యం.
4 ఏండ్లలో..
ఫ్యూచర్ సిటీలో 8రకాల జోన్లను వచ్చే నాలుగేండ్లలో పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టును స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) కార్యాచరణలో భాగంగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సెల్ సీఈవో జయేష్ రంజన్, అడిషినల్ సీఈవో ఈవీ నర్సింహ్మారెడ్డిలకు అప్పగించారు. స్పీడ్ కార్యక్రమంలో భాగంగానే వారం వారం సమీక్షలు చేస్తున్నారు.






