- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్ -2047’ ఆవిష్కరణ
విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఫ్యూచర్ సిటీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఫ్యూచర్ సిటీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 44కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్ కు హాజరయ్యారు. పోలీస్ శాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది. సమ్మిట్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు..భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి 12 అంశాలపై నిపుణులతో చర్చలు జరిగాయి. రెండో రోజైన మంగళవారం ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్ -2047’ ఆవిష్కరించనున్నారు.
అదిరిపోయే రీతిలో ఏర్పాట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది దేశ, విదేశాలకు చెందిన అతిరథ మహారథులు సమ్మిట్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేసింది. అతిథులకు స్వాగతం మొదలుకుని వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు అధికారులను ప్రత్యేకించి నియమించింది. తెలంగాణ రుచులతో కూడిన వంటకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ మోడల్ కు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను ప్రభుత్వం రూపొందించి ఈ సందర్భంగా విడుదల చేసింది. రాష్ట్ర ప్రగతికి సంబంధించి సమ్మిట్ ప్రారంభంలోనే ప్రదర్శించిన స్పెషల్ సాంగ్ సైతం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల సమ్మిట్ కు వచ్చిన అతిథులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మిట్‌ను రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు హీరో నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న సీఎం ప్రసంగం..
సమ్మిట్ వేదికపై పలువురు ప్రముఖులు ప్రసంగించి రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలను ఒకే వేదికపైకి రప్పించడం గొప్ప విషయమని, తెలంగాణ విజన్ ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం సైతం ఆద్యంతం ఆకట్టుకుంది. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని క్యూర్, ఫ్యూర్, రేర్ మూడు జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ లు తమకు ఆదర్శమని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరుకుంటామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
పెట్టుబడుల రైజింగ్..
తొలి రోజు సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ఏర్పాటుకు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నిర్వహించే వంతారా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే విన్ గ్రూప్ ఇండస్ట్రీస్ రూ.27 వేల కోట్లతో, ఏజీఐడీసీ సంస్థ రూ.70 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి విద్యుత్ సంస్థలతో భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని, రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆదాని గ్రూప్ ప్రకటించింది. రెండో రోజు మరిన్ని కంపెనీలు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.






