ప‌రిగిలో టాస్క్ ఫోర్స్ దాడులు

by Ratna Kumari |

పరిగిలో అక్రమ గ్యాస్ సిలిండర్లు, కుళ్లిన‌ మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాల పై బుధవారం టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు.

ప‌రిగిలో టాస్క్ ఫోర్స్ దాడులు
X

దిశ, పరిగి : పరిగిలో అక్రమ గ్యాస్ సిలిండర్లు, కుళ్లిన‌ మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాల పై బుధవారం టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వర్ పాషా, అతని బృందం పరిగి మున్సిపల్ లో దాడులు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు, కుళ్లిన‌ మాంసం, నిబంధనలకు విరుద్ధంగా ఐస్‌క్రీమ్‌ల తయారీ చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పరిగి విద్యానగర్ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి తన నివాసంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచినట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు.

ఈ తనిఖీల్లో 5 నిండుగా ఉన్న సబ్సిడీ సిలిండర్లు, 4 ఖాళీ సిలిండర్లు, 3 కమర్షియల్ నిండు సిలిండర్లతో కలిపి మొత్తం 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదే కాలనీలో మహ్మద్ ఖలీల్ అనే వ్యక్తి తన మటన్ షాపునకు సంబంధించి 35 కిలోల కుళ్లిన‌ మాంసాన్నినిల్వ ఉంచినట్లు గుర్తించి, దానిని సీజ్ చేశారు. పరిగి మెయిన్ రోడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా, గడువు ముగిసిన ముడి సరుకులు, పారిశ్రామిక రంగులు ఉపయోగించి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న శ్రీ నిత్య ఐస్‌క్రీమ్ యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు. వికారాబాద్‌కు చెందిన వర్కల హన్మంతు నుంచి సుమారు కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ కాలనీకి చెందిన కె.రమేష్ తన నివాసంలోనే తయారీ తేదీ, గడువు తేదీలు లేకుండా మహా ఐస్‌క్రీమ్ పేరుతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన నిందితులందరినీ తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పరిగి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి,కేసులు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చలగాటమాడేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు.

Next Story