- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాండూర్ - పెద్దేముల్ రోడ్డుకు మోక్షం ఎప్పుడో?
తాండూర్ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, కోటపల్లి వెళ్లడానికి పెద్దేముల్ రోడ్డు పలు గ్రామాలకు అనుసంధానమైంది.

దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. తాండూర్ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, కోటపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి తాండూర్ - పెద్దేముల్ రోడ్డు పలు గ్రామాలకు అనుసంధానమైంది. ఈ రోడ్డు పై నుంచే తాండూర్ బండలు, సిమెంట్, శుద్ద బెంటోనేట్ తదితర లోడ్ తో లారీలు నిత్యం భారీగా తిరుగుతుంటాయి. పెద్దేముల్ నుంచి తాండూర్ వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈ రహదారి వర్షాకాలంలో దెబ్బతిన్నది. ఈ రోడ్డుపైనుంచే పెద్దేముల్, కోట్ పల్లి, బంట్వారం, తట్టేపల్లి, నాగులపల్లి తదితర ప్రాంతాల నుంచి తాండూర్ పట్టణానికి తిరిగే వాహనదారులు ధ్వంసమైన రోడ్లతో అవస్థలు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం రోడ్డుపై పడిన గుంతలను మండల అధికారులు స్థానికుల సహాయంతో గుంతల్లో మట్టి, డస్ట్ పోయించి ప్యాచ్ వర్క్ చేసి కొంత మేర ప్రయాణికులకు, వాహనదారులకు ఉపశమనం కల్పించారు. ఇలా స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో గుంతలకు ప్యాచ్ వర్క్ చేస్తున్నట్లు చిన్న పాటి పనులు చేస్తూ ఫొటో లు దిగుతున్నారే తప్పా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడంలేదు. దీంతో వర్షాలు పడినప్పుడల్లా రోడ్డంతా మళ్లీ యథావిధిగా మారుతుండడంతో వాహనదారులకు నరకం కనబడుతున్నది.
గాజిపూర్ బ్రిడ్జి మీదుగా రోడ్డు పనులు జరిగేనా..?
పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ సమీపంలోని వాగులపై వంతెన నిర్మించేందుకు 2016లో ప్రభుత్వం సుమారు రూ.8.90 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో రవాణాశాఖ మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థా పన చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హయాంలో కూడా బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బ్రిడ్జి వద్ద రాకపోకలకు ఆటంకం కలుగుతుందని తెలుసుకొని, బ్రిడ్జి రోడ్డుకు మట్టి పొయించారు. పాత బ్రిడ్జిని మూసివేసి కొత్త బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పటివరకు బ్రిడ్జి మీద పక్క రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాకాలం బురద ఏర్పడి రాకపోకలకు ఆటంకం కలుగుతున్నది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఉన్నతాధికారులు స్పందించి గాజీపూర్ వాగుపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై బీటీ రోడ్డు పనులు పూర్తిచేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఫొటోలు దిగారు.. పనులు మరిచారు..
వారం క్రితం పెద్దేముల్ తహశీల్దార్, ఎస్ఐ వేణుకుమార్, విద్యాధికారి నర్సింగ్ రావ్ స్థానికుల సహాయంతో గాజిపూర్ వాగు బ్రిడ్జి వద్ద ప్రజలు బురదతో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిద్దామని వచ్చారు. స్థానికులు గాజిపూర్ గౌస్, ప్రకాశ్ రెడ్డి, అజాం ఖాన్ సహకారంతో రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నామని జేసీబీలతో పత్రికల ముందు ఫొటోలు దిగారు. తీరా చూస్తే వారం గడవకముందే రోడ్డు పరిస్థితి పునరావృతమైంది.
అధికారులు మాత్రం తాము రోడ్డు పనులు చేపడుతున్నామన్న చందంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారని, వారు ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై రాకపోకలు చేస్తే తాము పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని పలువురు వాహనదారులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గాజిపూర్ వాగు బ్రిడ్జి వద్ద బీటీ రోడ్డు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలి
తాండూర్ నుంచి పెద్దేముల్ మండల కేంద్రానికి, తాండూరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, కోట్ పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే తాండూరు- పెద్దేముల్ రహదారి ప్రధానమైంది. ఈ రహదారి ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. దీంతో రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. గాజీపూర్ బ్రిడ్జి వద్ద రోడ్డు బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలి.
- వీరప్ప, గాజీపూర్ మాజీ సర్పంచ్






