దిగుబడి తక్కువ, దిగుమతులు ఎక్కువ.. గిట్టుబాటు లేక మామిడి రైతుల అవస్థలు

by Naga Rani Yarlagadda |

నగర శివారులోని బాటసింగారం మార్కెట్​కు మామిడి దిగుమతి జోరుగా కొనసాగుతోంది.

దిగుబడి తక్కువ, దిగుమతులు ఎక్కువ.. గిట్టుబాటు లేక మామిడి రైతుల అవస్థలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: నగర శివారులోని బాటసింగారం మార్కెట్​కు మామిడి దిగుమతి జోరుగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మామిడికి సరైన మద్దతు ధర లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని బాటసింగారం మార్కెట్​కు భారీగా వచ్చి పడుతోంది. మామిడి కోతల సమయంలో ఆకాల వర్షాలు కురువడంతో పండ్లు చేడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో మార్కెట్​దిగుబడి లేదని అధికారులు వివరిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతోనే బాటసింగారం మార్కెట్‌కు దిగుమతి పెరిగిందని చెప్పుకోవాల్సిందే. దీంతో మరో 15 రోజుల వరకు మామిడి సీజన్ కొనసాగే అవకాశం ఉంది.

నష్టపోయిన రైతులు..

రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఫ్రూట్ మార్కెట్​లో మామిడి సీజన్ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంట నష్టం జరిగిపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. చీడపీడలు, తెగుళ్లు మామిడి కాతపై ప్రభావం చూపిస్తున్నాయి. మామిడి పూతకొచ్చిన సమయంలో చలి కారణంగా పూత, పిందె రాలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పడిపోయాయి. తాజాగా వేసవి ఎండలు, వడగాలులు, అకాల వర్షాల భయంతో రైతులు పక్వానికి రాక ముందే మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.

ఈ జిల్లాల నుంచే దిగుమతి..

ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్​నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూర్, కడప, నుజివీడు నుంచి కూడా అత్యధికంగా మామిడి పండ్ల దిగుమతి ఫ్రూట్​మార్కెట్​కు వస్తుంది. ఈ జిల్లాల్లో బంగినపల్లి, బేనిషన్, తోతాపురి, హిమయత్, కీసారి, రసాల పండ్లు సాగు చేస్తున్నారు. చిత్తూర్, కడప, నూజివీడులో తోతాపురి పండ్లు అధికంగా వస్తున్నాయి. బాటసింగారం మార్కెట్​నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు 70 శాతం ఎగుమతి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొల్లాపూర్ మామిడిని లండన్, న్యూజిలాండ్, అమెరికాకు ఎగుమతి చేయనున్నారు. పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలతో కలిపి సుమారుగా 16 రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి మామిడిని ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఈ ఏడాది 30 వేల మెట్రిక్​టన్నులు అధికం..

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 వేల మెట్రిక్​టన్నుల మామిడి దిగుమతి బాటసింగారం మార్కెట్​కు చేరుకుంది. గతేడాది 1,12,000 మెట్రిక్​ టన్నుల దిగుమతి ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,42,000 మెట్రిక్​టన్నులు దిగుమతి జరిగినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని ప్రజలకు సరైన మామిడిని అందుబాటులో ఉంచుకొని మిగిలిన పండ్లు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయనున్నారు. మామిడి సీజన్​ఏప్రిల్ నుంచి జూలై 15వ తేదీ వరకు ఉంటుంది. సాధరణంగా జూన్​తో సీజన్​ముగుస్తుంది. కానీ ఏపీలోని రైతుల ఫ్రూట్​మార్కెట్​కు తరలించడంతో మరింత సమయం పడుతుంది.

ఆంధ్ర కంటే ధరలు బెస్ట్..

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూర్​, కడప జిల్లాలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. అయితే కిలో మామిడికి రూ. 4లు గిట్టుబాట కల్పించడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని బాటసింగారం మార్కెట్‌లో కిలోకు రూ. 11 నుంచి రూ. 14 వరకు ఇవ్వడంతో ఆంధ్ర నుంచి తెలంగాణకు బారులు తీరారు. రెండు రోజుల క్రితం మామిడి సీజన్​కు స్వస్తి పలకాలని అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని మామిడి రైతులు బాటసింగారం మార్కెట్​లో ధరలు అధికంగా ఉన్నాయనే నేపథ్యంలో బారులు తీరారు. తోతాపురి మామిడి పండ్లకు పెద్దగా డిమాండ్​ఉండకపోవడంతో ధరలు లేవని తెలుస్తోంది. మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్​నిర్ణయించిన ధర కంటే తెలంగాణలోని ధరలు చాలా అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.

Next Story