సెలవుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు

by velandi.Saikiran |   (  Updated:2025-12-15 22:45:45  IST  )

రంగారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్స్​ అండ్‌ స్టాంప్స్​ శాఖలోని ఉద్యోగులు వరుసగా సెలవులపై వెళ్తున్నారు. మరికొందరు ఇదే బా

సెలవుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు
X

సెలవుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు

- ఇప్పటికే కొంతమంది సెలవుల్లో..

- మరికొందరు సైతం సెలవులపై వెళ్లేందుకు సన్నద్దం

- ఏసీబీ నిఘాతో పాటు వరుస సస్పెన్షన్లే కారణం!

- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ప్రత్యేక ఫోకస్

- అడ్డగోలు రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులకు వరుస ఫిర్యాదులు..అవినీతి పరుల్లో దడ

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్స్​ అండ్‌ స్టాంప్స్​ శాఖలోని ఉద్యోగులు వరుసగా సెలవులపై వెళ్తున్నారు. మరికొందరు ఇదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఏసీబీ నిఘాతోపాటు సస్పెన్షన్ల పరంపర కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సబ్‌ రిజిస్ట్రార్లపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఆ శాఖ ఉన్నతాధికారులకే కాదు.. ఏకంగా ఏసీబీకి, రెవిన్యూ మంత్రికి సైతం ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇప్పటికే కొంతమందిపై సస్పెన్షన్‌ వేటు పడగా.. అక్కడక్కడా ఏసీబీకి సైతం రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు. అవినీతి, అక్రమాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతుండడం..వీటిపై సంబంధిత శాఖ ఐజీ సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఏసీబీ సైతం పలు రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచిందన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఇవన్నీ అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తున్నాయి. తమపై ఎప్పుడు..ఏ రకమైన చర్యలు ఉంటాయో! అన్న భయంతో సెలవులపై వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. కొంతమంది అనుమతి తీసుకుని వెళ్తే..మరికొందరు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పాపెట్టకుండానే సెలవులపై వెళ్తున్నట్లు తెలిసింది.

రియల్‌ వ్యాపారులకు వత్తాసు..

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో 22 వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయితే చాలామంది సబ్‌ రిజిస్ట్రార్‌ లు రియల్‌ వ్యాపారులకు వత్తాసు పలికి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవి క్లియర్‌ టైటిలేనా? ప్రభుత్వ భూములా!. నిషేధిత జాబితాలో ఉన్నాయా?. వాటిపై ఏవైనా వివాదాలు, అభ్యంతరాలు ఉన్నాయా? వంటి వాటిని పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ..ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. లింక్‌ డాక్యుమెంట్లు లేకున్నా.. సంబంధిత ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నాన్‌ లే అవుట్‌ ప్లాట్లు, పార్కు స్థలాలను సైతం ప్రైవేటు భూములుగా చూపి రిజిస్ట్రేషన్‌ చేసిన సందర్భాలు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లను అడ్డుపెట్టుకుని కొంతమంది రిజిస్ట్రార్లు గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రార్ల తప్పిదాలకు నిజమైన హక్కుదారులకు తీరని అన్యాయం జరుగుతోంది.

ఇబ్రహీంపట్నం ఇంఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సోనిపై ఇటీవల ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈమెపై ఏసీబీకి సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. జీపీఏ చేయని ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేయడం.. ఇతర వాటిపై కూడా పలు ఫిర్యాదులు వెళ్లాయి. డీఐజీ కార్యాలయం నుంచి డిప్యూటేషన్‌ పై వచ్చి ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమెపై వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల సెలవులు పెట్టి వెళ్లిపోయారు. అయితే ఆమెను డీఐజీ కార్యాలయానికి సరెండర్‌ చేసినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోనే పనిచేస్తున్న మరో సబ్‌ రిజిస్ట్రార్‌ సైతం అనారోగ్యం కారణంగా సెలవుపె వెళ్లారు. దీంతో ఇక్కడ సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సైతం సెలవులపై వెళ్లారు. వివిధ కారణాలతో వనస్థలి పురం, సరూర్‌ నగర్‌, హయత్‌ నగర్‌, తాండూరు తదితర కార్యాలయాలకు సబ్‌ రిజిస్ట్రార్లు లేక కింది స్థాయి ఉద్యోగులే ఆ బాధ్యతలను చూసుకుంటున్నారు.

హడలెత్తిస్తున్న వరుస ఘటనలు..

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇటీవలి కాలంలో ఏసీబీ కేసులు, సస్పెన్షన్లు వరుసగా చోటుచేసుకుంటుండడం ఆశాఖ అధికారులను హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటుండగా వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేష్‌ గత నెలలో ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు. ఈయన స్థానంలో సీనియర్‌ ఉద్యోగి శివ శంకర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే హయత్‌ నగర్‌ మండలం సాహెబ్‌ నగర్‌ రెవిన్యూ పరిధిలోని పార్కు స్థలానికి అక్రమ రిజిస్రేషన్‌ చేయడంతో స్థానికులు రెవిన్యూ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు శివ శంకర్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. దీనికి ఒక్క రోజు అటు ఇటుగా లంచం తీసుకున్న ఆరోపణలపై హై కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి సరూర్‌ నగర్‌ రిజిస్ట్రార్‌ శ్రీలతపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

గండి పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితమే ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తోంది. ఆరు నెలల క్రితం తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 220 ప్లాట్లను నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడింది. ఇందుకు బాధ్యుడైన ఇంఛార్జి రిజిస్ట్రార్‌ ఫసియోద్దిన్‌ తోపాటు పాటు మరో ఉద్యోగిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగ..ఇక్కడ ఇంఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వర్తిస్తున్న సాయి కుమార్‌ సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో! అన్న భయంతో చాలా మంది సెలవులపై వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు రిజిస్ట్రేషన్‌ శాఖలో చర్చ జరుగుతోంది.

Next Story