చెట్ల కిందే విద్యార్థుల చదువులు

by Yella Dhawani Reddy |

నగరానికి రెండు పదుల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు వేధిస్తున్నాయి.

చెట్ల కిందే విద్యార్థుల చదువులు
X

దిశ, శంకర్‌పల్లి : నగరానికి రెండు పదుల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ ప్రాథమిక పాఠశాల (నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోకి ఇటీవలే మార్చారు)లో ఐదు తరగతులకు మూడు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కో గదిలో రెండు తరగతులను, ఓ తరగతిలో విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో వారికి చెట్టు కింద విద్యా బోధన చేస్తున్నారు. మరో తరగతి విద్యార్థులను ఆరుబయట వరండాలో కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తున్నారు.

ఇద్దరే ఉపాధ్యాయులు..

ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులే ఉండగా.. ఇటీవల డిప్యూటేషన్ పై ఒక ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు పంపించినట్లు సమాచారం. మన ఊరు మనబడి పథకంలో భాగంగా ఇక్కడి పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఫర్నిచర్ సరఫరా చేయగా గదుల కొరతతో స్టోర్ రూమ్ లోనే భద్రపరిచారు. మండలంలోనే ఈ పాఠశాల అత్యధికంగా విద్యార్థులు ఉన్నప్పటికీ 2014లో ఇక్కడ మూడే గదులు నిర్మించారు. ఒకటో తరగతిలో 19 మంది, రెండో తరగతిలో 23 మంది, మూడో తరగతిలో 30 మంది, నాలుగో తరగతిలో 22 మంది, ఐదో తరగతిలో 27 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య

ఇంద్రారెడ్డి నగర్‌లో పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే వారికి అనుగుణంగా తరగతి గదులను నిర్మించాల్సిన ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. దీనికి తోడు ఉపాధ్యాయుల సమస్య కూడా ఉంటుంది. కొత్తగా గదులు నిర్మించి, ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గదుల కొరత తీవ్రంగా ఉంది

మా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం. మరో ఉపాధ్యాయుడు డిప్యుటేషన్‌పై వచ్చారు. ఈ పాఠశాలలో 121 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది 78 మందే ఉండగా.. ఈ జూన్‌లో 50 మందిని చేర్చుకున్నాం. ప్రస్తుతం గదులు సరిపోక చెట్ల కింద బోధన చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అదనపు తరగతి గదులను నిర్మిస్తే బావుంటుంది. ప్రస్తుతానికి వంటగదిని ప్రధానోపాధ్యాయుడి గదిగా ఉపయోగించుకుంటున్నాం.

- గౌడి చర్ల నగేష్, ప్రధానోపాధ్యాయుడు

Next Story